బాబోయ్.. ఇంత అవినీతి పరులా?
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలక పక్షం అవినీతి అక్రమాలు దందాలను చూసి ఆ పార్టీ అధిష్టానానికే కళ్లు బైర్లు కమ్మాయి.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలక పక్షం అవినీతి అక్రమాలు దందాలను చూసి ఆ పార్టీ అధిష్టానానికే కళ్లు బైర్లు కమ్మాయి. జీవీఎంసీ పాలన ఇంత ఘోరంగా, దారుణంగా వుందా? అని పార్టీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారు. రానున్న ఎన్నికలలో జీవీఎంసీ పాలక పక్ష పెద్దలలో కొందరికి అసెంబ్లీ టికెట్‌లు ఇచ్చే అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది. ఇందుకోసం కొన్ని పేర్లను ఎంపిక చేసి తమ సొంత సర్వే సంస్థలతో వివరాలు రాబట్టింది. వాటిని పరిశీలించిన తరువాత వీరికి టికెట్ ఇస్తే ఇక ఇంతే సంగతులు అనే అంశం స్పష్టమైందట. అంతేకాదు, జీవీఎంసీ పాలక వర్గాన్ని అదుపులో పెట్టకుండా ఇలాగే వదిలేస్తే అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన పార్టీ పెద్దలలో వ్యక్తమైందట. రానున్న ఎన్నికల సమయంలో మహా విశాఖ నగర పాలక సంస్ధ పరిధిలోని అసెంబ్లీ పార్లమెంటు నియోజక వర్గాలలో జీవీఎంసీ పాలక పక్ష పెద్దలు, కార్పొరేటర్ల అవినీతి అక్రమాల ప్రభావం ఎంత మేర ఉంటుందో అని భయపడుతున్నారు.
భర్త శ్రీనుతో మేయర్ సీటుకు చేటు
విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరుల పేర్లను రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అధిష్టానం పరిశీలించింది. యాదవ సామాజిక వర్గానికి విశాఖ నగరంలో కచ్చితంగా ఒక సీటు ఇవ్వాలనే ఉద్దేశంతో మేయర్ పేరును పరిగణనలోకి తీసుకొన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇంచార్జిగా ప్రకటించడంతో గాజువాక నుంచి యాదవులను నిలబెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన జీవీఎంసీ కార్పొరేటర్ ఉరుకూటి చందును ఇన్‌చార్జిగా పెట్టారు. అయితే, ఆయన సరిపోడని మేయర్ హరి వెంకట కుమారి పేరును పరిశీలించారు. అయితే, ఆమె భర్త గొలగాని శ్రీనివాస్ అవినీతి అక్రమాల కారణంగా ఆమె పోటీకి తగరని నివేదికలు వచ్చాయి. దీంతో ఆమెను ఎన్నికల తర్వాత మేయర్ సీటు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
షాడో మేయర్ శ్రీధర్
కాపు సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ సీనియర్ కార్పొరేటర్ కావడం, బొత్స సత్యనారాయణ అనుచరుడు కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాధ్‌కు ప్రత్నామ్నాయంగా అనకాపల్లి లేదా గాజువాక లో శ్రీధర్ ను నిలిపే ఆలోచన పార్టీ చేసింది. అయితే, జీవీఎంసీలో జరిగిన కోట్ల రూపాయల దందాలు, భూకబ్జాలు, అక్రమాలలో శ్రీధర్ హస్తం ఉందని స్వంత నివేదికలలోనే రావడం, వ్యతిరేకత కనిపించడంతో ఎమ్మెల్యే టికెట్ ప్రతిపాదనలను అంతటితో ఆపేశారు.
బాణాల శ్రీనివాస్‌తోనూ కష్టమే
జీవీఎంసీ ఫ్లోర్ లీడర్‌గా వున్న బాణాల శ్రీనివాస్ కు డ్వాక్రా సంఘాలలో మంచి పట్టు ఉండటం, సీనియర్ నేత కావడంతో ఆయన పేరును ఒక దశలో పరిశీలించారు. అయితే, పాలన కంటే అవినీతి, అక్రమాలకే ఆయన పెద్దపీట వేస్తారని తేలడం, విశాఖ ఉత్తర నియోజక వర్గంలో ఇన్చార్జి కే కే రాజు చేసే దందాలలో ఆయననే కీలక పాత్ర కావడం ఆయన అవకాశాలను దెబ్బ తీసినట్లు తెలిసింది. జీవీఎంసీలో అంచానాలను విపరీతంగా పెంచేయడం, ప్రతిపక్ష పార్టీలను కూడా సిండికేట్ చేసి లంచాలు కొట్టేయడం లో ఆయన పాత్ర పై ఆధారాలు లభించడంతో అధిష్టానం ఆయన పేరును పరిశీలించే పనిని నిలిపివేసింది.
గతంలో సర్పంచ్ లు, మండల స్థాయి నేతలు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ల తర్వాత శాసనసభ్యులుగా పోటీకి దిగేవారు. 98 మంది కార్పొరేటర్లు వున్న జీవీఎంసీలో అధికార పార్టీకి పనికివచ్చే వారు ఒక్కరూ దొరక్కపోవడం నిజంగా విచిత్రమే. గతంలో జీవీఎంసీ లో కార్పోరేటర్లుగా పనిచేసిన తైనాల విజయకుమార్, తిప్పల నాగిరెడ్డి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. పలువురు కార్పొరేటర్లు వివిధ పార్టీల నుంచి పోటీ చేశారు. మితిమీరిన అవినీతి, జనాన్ని లంచాల కోసం పీడించుకు తినడం, అధికారులతో కుమ్మక్కై వాటాలు వేసుకోవడం వంటివి అవకాశాలను దెబ్బతీస్తున్నాయి.
Read More..