స్టెల్లా ఎల్ పనామా విడుదలకు రంగం సిద్ధం!

పిడిఎస్ బియ్యాన్ని విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా అనే పేరున్న షిప్‌లో తరలిస్తున్నారనే అరోపణల నేపథ్యంలో పోర్టు అధికారులు సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Update: 2024-12-19 02:09 GMT

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: పిడిఎస్ బియ్యాన్ని విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా అనే పేరున్న షిప్‌లో తరలిస్తున్నారనే అరోపణల నేపథ్యంలో పోర్టు అధికారులు సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బియ్యాన్ని పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నట్లు గుర్తించడంతో, ఇన్ని రోజులుగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరోవైపు పోర్ట్ అధికారుల కనుసన్నల్లోనే వందల కోట్ల విలువైన బియ్యాన్ని సముద్రం దాటించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ షిప్‌ను సీజ్ చేస్తారా విడుదల చేస్తారానే ప్రశ్నలకు త్వరలో ముగింపు రానుంది.

సీజ్ చేయడం కుదరదా..

స్టెల్లా ఎల్ పనామా షిప్ సీజ్ చేయడం కుదరదనే అభిప్రాయం కేంద్రం నుంచి వ్యక్తం కావడంతో పాటు న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి బియ్యం లోడింగ్‌కు వచ్చిన స్టెల్లా షిప్ కాకినాడ పోర్టులోనే నెల రోజులుగా నిలిచి ఉంది. దీనిపై బియ్యం ఎగుమతిదారులు తాజాగా అడ్మిరాలిటీ కోర్టును ఆశ్రయించారు. 28 మంది కలిసి నౌకను అద్దెకు తీసుకోగా ఎగుమతిదారుల్లో 15 మందికి సంబంధించి బియ్యం లోడింగ్ పూర్తయ్యింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీతో మిగతా బియ్యం లోడింగ్ నిలిచిపోయింది. కలెక్టర్ షణ్మోహన్ తనిఖీలతో పీడీఎస్ 1320 మెట్రిక్ టన్నుల బియ్యం బయట పడింది.

హైకోర్టుకు చేరిన వ్యవహారం..

పారా బాయిల్డ్ రైస్‌ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చిత్ర, యాగ్రీ ఎక్స్ పోర్ట్, పద్మశ్రీ రైస్ మిల్, సూర్య శ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాథ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటంటూ ప్రశ్నించింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై కొంత సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు‌ను కోరగా, విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం మినహా మిగిలిన బాయిల్డ్ రైస్, రా రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.


Similar News