తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ..కారణం ఏంటంటే?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించిన జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు కీలక పదవులు దక్కించుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. సిద్దిపేటలో పవన్ అభిమానులు భారీ గజమాలతో ఆయనను సత్కరించారు.
ఈ నేపథ్యంలో గతేడాది కూడా పవన్ కల్యాణ్ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసిన తర్వాత ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు (ఆదివారం) హైదరాబాద్ మాదాపూర్ తన నివాసంలో ఉన్నారు. కొండగట్టు గట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు హైదరాబాద్‌లోనే ఆయన ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.