Monitor lizard curry : ఉడుము కూరపై వీడియో...ఇద్దరి అరెస్టు
యూ ట్యూబ్ లో లైక్ లు, సబ్ స్క్రైబ్ ల పిచ్చితో ఉడుము కూర(Monitor lizard curry)ఎలా వండాలో చూపిస్తూ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన యూట్యూబర్ల(YouTubers) నిర్వాకం వారిని కేసుల పాలు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : యూ ట్యూబ్ లో లైక్ లు, సబ్ స్క్రైబ్ ల పిచ్చితో ఉడుము కూర( Monitor lizard curry)ఎలా వండాలో చూపిస్తూ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన యూట్యూబర్ల(YouTubers) నిర్వాకం వారిని కేసుల పాలు చేసింది. మన్యం పార్వతీపురంలో ఉడుము కూర వండిన, వీడియోను యూట్యూబ్‌లో పెట్టిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని బండిదొరవలస గ్రామానికి చెందిన చీమల నాగేశ్వరరావు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. స్థానికంగా వీడియోలు చిత్రీకరించి వాటిని యూ ట్యూబ్‌లో పెట్టేవాడు. ఈ క్రమంలో గత నెలలో బండిదొరవలస గ్రామానికి చెందిన ఎ. నానిబాబుతో కలిసి స్థానిక అడవిలో ఉడుమును పట్టుకున్నారు. యూట్యూబర్లు చీమల నాగేశ్వరరావు, నాని బాబు ఉడుము కూర ఎలా వండాలన్న వీడియో చేసే క్రమంలో సజీవంగా ఉన్న ఉడుమును చంపి..ముక్కలు చేసి కూర వండుతూ వీడియో తీసి దానిని యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
వీడియో చూసిన యానిమల్ పరిరక్షణ సభ్యులు ఉడుము మాంసం తినేలా ప్రోత్సహించేదిగా ఉందంటూ అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది వారు ఈ వీడియో తీసిందేవరన్న దానిపై పార్వతీపురం రేంజ్ అటవీ అధికారులు ఆరా తీసి నిందితులపై వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో సిరిసిల్లకు చెందిన ఒక యూట్యూబర్ నెమలి కూరను ఎలా వండాలో చూపించి కటకటాల పాలయ్యాడు. పోలీస్ కేసు నమోదైన తర్వాత తాను నెమలిని చంపలేదని నాటు కోడిని వండి యూ ట్యూబ్ వ్యూస్ కోసం నెమలిగా ప్రచారం చేసినట్టు అటవీ అధికారులకు వాంగ్మూలమిచ్చాడు. ఈ కేసు దర్యాప్తులో ఉంది. గతే ఏడాది కూడా అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో అప్పలరాజు, సింహాద్రి సహా యూట్యూర్లు ఉడుమును వేటాడి వండి తిన్న వీడియో పోస్ట్ చేశారు. అప్పట్లో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.
ఉడుములు కూడా పులులు, నెమళ్ల జాబితాలోని షెడ్యూల్ వన్ కేటగిరీలోకి చేరాయని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతుండడం, వన్యప్రాణుల వేట పెరిగిపోతున్న నేపథ్యంలో గత ఏడాది అటవీ చట్టాలు మరింత కఠినతరం చేశారన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణుల్ని చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు.