తిరోగమనం వైపు ఏపీ.. చంద్రబాబుపై జగన్ సంచలన విమర్శలు
రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తోందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాలనపై విమర్శలు చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. ఎటు చూసినా లిక్కర్, ఇసుక స్కామ్‌లతో పాటు పేకాట క్లబ్బులే కనిపిస్తున్నాయని విమర్శించారు. కలెక్షన్ మెకానిజంతో మాఫియా నడుస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ(Arogyashri)లో రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, విద్యాదీవెన లేక డ్రాపౌట్లు పెరుగుతున్నాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేయాలని తాము ప్రతి అడుగు ముందుకు వేశామని చెప్పారు. ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగామన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే ప్రతి పథకం డోర్ డెలివరీ ఇచ్చామని చెప్పారు. బడ్జెట్లో కేలండర్ ఇచ్చి మరీ పథకాలను అమలు చేశామన్నారు. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.