ఏపీలో అరుదైన సంఘటన.. ఎమ్మెల్యేకు ఫార్చ్యూనర్ కారు కోనిచ్చిన ఓటర్లు

సర్పంచ్‌గా గెలిస్తే చాలు.. ఖద్దరు బట్టలు, కారు, అనుచరులు అంటూ అంతా ఇంతా హంగామ చేయారు. ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే.. కేబినెట్ మినిస్టర్‌లా హడావిడి చేస్తుంటారు.

Update: 2024-07-02 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్‌గా గెలిస్తే చాలు.. ఖద్దరు బట్టలు, కారు, అనుచరులు అంటూ అంతా ఇంతా హంగామ చేయారు. ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే.. కేబినెట్ మినిస్టర్‌లా హడావిడి చేస్తుంటారు. ఏకంగా పదికి తక్కువ కాకుండా ఓ కాన్వాయ్‌నే మెంటెన్ చేస్తారు. అధికార దర్పం అంటే ఇది అనే లెవల్లో సీన్ క్రియేట్ చేస్తారు. కానీ వీటన్నీటికి భిన్నంగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన ఎమ్మెల్యే వ్యవహరించారు. అధికారిక సమావేశాలకు, పార్టీ మీటింగ్‌లకు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు బైక్‌పైనే వెళ్తున్నారు. లేదా మిత్రుల కార్లలో హాజరవుతున్నారు. ఇదంతా చూసిన ఓటర్లు, అభిమానులు ఎమ్మెల్యేకు కారు గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువగా వెంటనే విరాళాలు సేకరించి రూ.10 లక్షలు జమ చేశారు. వాటిని డౌన్ పేమెంట్‌గా కట్టి ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసి ఎమ్మెల్యేకు బహుమతిగా ఇచ్చారు.

ఇంతటి అరుదైన సంఘటన ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరిగింది. సామాన్య గిరిజన రైతు కుటుంబానికి చెందిన చిర్రి బాలరాజు జనసేన పార్టీ నుంచి పోటీ చేసి పోలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయనకు కారు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో జనసేన కార్యకర్తలు, ఓటర్ల కలిసి చిర్రి బాలరాజుకు కారుగా గిఫ్ట్‌గా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన చిర్రి బాలరాజు జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లోనూ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తాజాగా 2014 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో కూటమి తరుఫున పోలవరం సీటు జనసేనకు కేటాయించారు. ఈసారి కూడా చిర్రి బాలరాజు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన చిర్రి బాలరాజు ఆర్థిక పరిస్థితులను చూసి అభిమానులు విరాళాలు సేకరించి ఫార్చ్యూనర్ కారును కోనిచ్చారు. మిగతా ఎమ్మెల్యేలకు ధీటుగా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండాలని, ఆయనకు కారు కొనే ఆర్థిక స్థోమత లేదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసైనికులు తెలిపారు. డౌన్ పేమెంట్ రూ.10 లక్షలు అభిమానులు చెల్లించగా.. మిగతా మొత్తాన్ని ఎమ్మెల్యే ఈఎంఐల రూపంలో చెల్లించనున్నారు. కాగా, ఎమ్మెల్యేపై ఇంతటి అభిమానాన్ని చూపిన ఓటర్లు, అభిమానుల మనసును చూసి అందరూ ఔరా.. అనక తప్పడం లేదు.

Similar News