విషాదం.. పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధుల మృతి
తిరుపతి, కృష్ణా జిల్లాల్లో పింఛన్ల కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారు......
దిశ, వెబ్ డెస్క్: పింఛన్ల పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీపై సీఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో సచివాలయాల వద్ద ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తోంది. దీంతో సచివాలయాల వద్దకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు భారీగా చేరుకుని పింఛన్ డబ్బులు తీసుకుంటున్నాయి. అయితే సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండ వేడిమి తీవ్రంగా ఉంది. దీంతో వృద్ధులు తీవ్ర అవస్థలు పెడుతున్నారు. వడదెబ్బ తగులుతుండటంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే కృష్ణా, తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో పెన్షన్ కోసం వెళ్తూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. తిరుపతి జిల్లా ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు సచివాలయం వద్దకు పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధుడు షేక్ అసం వడదెబ్బ తగిలి మృతి చెందారు.
ఈ రెండు ఘటనలతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ చావులను కారణం ప్రతిపక్ష పార్టీలేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలకు ప్రతిపక్ష నేతలే కారణమని విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ప్రతిపక్ష నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా అధికార వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడుతున్నారు. వార్డు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలను బూచిగా చూపి ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడం తగదని సూచిస్తున్నారు. సినిమా రిలీజ్‌లకు రెవెన్యూ ఉద్యోగులను వినియోగించిన ప్రభుత్వం.. పింఛన్ల పంపిణీ ఉపయోగించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుల మృతి ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు.