టీటీడీ ధార్మిక కార్యక్రమాలు బాగున్నాయి: శారదా పీఠాధిపతి
లోక కళ్యాణం కోసం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: లోక కళ్యాణం కోసం టీటీడీ నిర్వహిస్తున్న చతుర్వేద హవనాలు, పారాయణ కార్యక్రమాలు ఇతర ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగున్నాయని, భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పెందుర్తిలో గల శ్రీశారదా పీఠంలో జనవరి 27 నుండి 31వ తేదీ వరకు చతుర్వేద హవనం నిర్వహించారు. చివరి రోజైన మంగళవారం పూర్ణాహుతితో ఈ హవనం ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ..భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలను అందిస్తున్న టీటీడీ బోర్డును, ఈవో ధర్మారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, శ్రీనివాస కల్యాణాలు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు, వేదపారాయణం, హోమాలు, గో సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కొనియాడారు.