Thirumala: సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో శ్యామలరావు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఈవో శ్యామల రావు కలిశారు.

Update: 2024-09-22 08:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. తిరుమల బ్రహ్మోత్సవాలకి హాజరుకావాలని సీఎంకు ఆహ్వానం అందించారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఈవో శ్యామల రావు లడ్డూ కల్తీపై సీఎంకు ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో ఈవో అందజేశిన నివేదికపై ఆలయ అధికారులతో చర్చించారు. అలాగే శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై అర్చకులు పలు సూచనలు చేశారు. సోమవారం రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహించి అనంతరం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని నిర్వహించాలని, చివరకు ముగింపుగా పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. శ్రీవారి అర్జిత సేవలకు ఆటంకం కలగకుండా అన్ని యాగాలు ఓకే రోజు తలపెట్టామని అధికారులు వివరించారు.


Similar News