Thirumala Issue: లడ్డూ అంశంపై ప్రధాని మోడీకి వైసీపీ నేత జగన్ బహిరంగ లేఖ

Update: 2024-09-22 09:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. లేఖలో తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను, చిత్తశుద్ధిని, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని, ఈ సున్నితమైన పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించకపోతే, సూదూర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టీటీడీ పై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు హిందువుల మనోబావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. టీటీడీ యొక్క పరిపాలనను పర్యవేక్షించే అధికారం దర్శకర్తల మండలికి ఉంటుందని, ఆలయ వ్యవహారాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిది తక్కువ పాత్ర ఉంటుందని వెల్లడించారు. నెయ్యి సేకరణ ఈ-టెండరింగ్ ప్రక్రియలో జరుగుతోందని, టెండరింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తక్కువ కోట్ చేసిన సరఫరాదారుని ఎంపిక చేసి, వారి ఆమోదం కోసం బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ముందు ఉంచబడుతుందని తెలిపారు. అలాగే ఆలయానికి చేరే నెయ్యి ఉన్న ట్యాంకర్తో పాటు నెయ్యి యొక్క స్వచ్ఛత, ఉత్పత్తి యొక్క నాణ్యతకు సంబంధించి, ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలను సేకరించి పరీక్షిస్తారని, మూడు నమూనాలు పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతించబడుతుందని తెలిపారు.

ఈ నమూనాలలో ఒకటి కూడా నాసిరకం అని తేలితే, ట్యాంకర్ తిరస్కరించబడుతుందని, అందువల్ల, ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్న తలెత్తే అవకాశమే లేదని చెప్పారు. వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లు తిరస్కరణకు గురై లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదని, అటువంటి దృఢమైన విధానాలు, పద్ధతులు అమలులో ఉన్నందున, కల్తీ నెయ్యి గుండా వెళ్ళడం, ప్రసాదం తయారీలో ఉపయోగించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇక పైన వివరించిన విధానం గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉందని, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి వాస్తవానికి, టీటీడి పనితీరుపై సమీక్ష జరిపి, పటిష్టతను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. ఈ అంశంలో సీఎం వ్యవహరించిన విధానం పూర్తిగా సామాజికంగా లేదని, దీనిపై కేంద్రం కలగజేసుకొని, తగిన చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.


Similar News