Ap News: ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర .. ఎన్ని కిలో మీటర్లు నడిచారంటే..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది...

Update: 2023-12-18 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర నేటితో పూర్తి అయింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/ మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దిగ్విజయంగా లోకేశ్ పాదయాత్ర జరిగింది. మొత్తం 3,132 కిలో మీటర్లు మేర లోకేశ్ పాదయాత్ర చేశారు. గతంలో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఎక్కడైతే ముగించారో లోకేశ్ కూడా అక్కడే తన యువగళం పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద నారా లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. లోకేశ్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. దీంతో వారందరికి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అసమర్ధుడు సీఎం అయ్యారని, వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని చెప్పారు. భవిష్యత్ పై ఆశలు కోల్పోయిన యువతకు తన యువగళం పాదయాత్రతో భరోసా కల్పించానని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు.



Similar News