Pawan Kalyan : నేటి నుంచి పవన్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభం
తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం (Tirumala Tirupati Laddu Prasadam Controversy) తయారీలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో ఏకంగా జంతువుల కొవ్వును సైతం వినియోగించారని టీడీపీ (TDP) ఆధారాలు చూపిస్తుంటే.. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధమయ్యారు. తిరుమల క్షేత్రంలో జరిగిన అపవిత్రానికి క్షమించమని శ్రీవారిని కోరుకుంటూ 11 రోజుల పాటు ఈ దీక్షను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఈ రోజు నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ ఈ దీక్ష స్వీకరించారు. ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్‌కు దీక్షాకంకణం కట్టి ఆశీర్వదించారు. ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమవుతున్న ఈ దీక్ష 2వ తేదీ (పై వచ్చే బుధవారం) వరకు కొనసాగనుంది. దీక్ష తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా తిరుమల వెళ్లనున్నారు. కాగా.. ఈ విషయాన్ని శనివారమే ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.