Pawan Kalyan Tour: చిరు బాటలో పవన్.. తిరుపతి నుంచే పొలిటికల్ టూర్
Pawan Kalyan to start statewide tour from tirupati on october 5| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఖరారైనట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
దిశ, ఏపీ బ్యూరో: Pawan Kalyan to start statewide tour from tirupati on october 5| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఖరారైనట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అక్టోబర్ 5న విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతా పర్యటించటం, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకు పర్యటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనసైనికులు ఈ పర్యటనకు సిద్ధంగా ఉండాలని నాదెండ్ల సూచించారు. పవన్ సోదరుడు నాగబాబు తిరుపతి నుంచి అక్టోబర్ 5న విప్లవం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ముందస్తు ఎన్నికల కోసమేనా?
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతలు గడప గడపకూ మన ప్రభుత్వం పేరిట ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తున్నారు. తాజాగా పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన సైతం ఖరారు కావడంతో, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలుండే చాన్స్ ఉందన్న సమాచారం జనాల్లోకి వెళ్తున్నది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉండే అవకాశం లేకపోలేదని, ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, నేతలంతా సన్నద్ధంగా ఉండాలని పవన్ ఇప్పటికే తన పార్టీ నేతలకు సూచించారు.
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
తిరుపతి నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడం ఓ సెంటిమెంట్‌లా వస్తున్నది. తిరుపతిలోనే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించారు. తిరుపతి నియోజకవర్గం నుంచే పోటీ చేసి, విజయం సాధించిన విజయం తెలిసిందే. పవన్ తన రాజకీయ పర్యటనను తిరుపతి నుంచే ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగబోతున్న పవన్, అక్టోబర్ నాటికి అగ్రిమెంట్ చేసుకున్న సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తిరుపతి సెంటిమెంట్ పవన్‌కు వర్క్‌వుట్ అవుతుందా లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
వచ్చే మార్చిలోనే ఎన్నికలకు అవకాశం?
రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. బహుశా వచ్చే మార్చిలోనే ఎన్నికలు రావొచ్చు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని .. పాలనను ప్రజానీకమంతా వ్యతిరేకిస్తున్నదని, సుమారు 73 శాతం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఎంతో సమయం లేదని, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనసేన ప్రభుత్వం తీసుకురావడానికి క్రియాశీలక సభ్యులు రెండు గంటల పాటు కష్టపడాలని సూచించారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు 50 మంది నుంచి 100 మందిని ప్రభావితం చేసేలా తయారు కావాలని పిలుపునిచ్చారు. తెనాలిలో శుక్రవారం పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యులకు శిక్షణ వచ్చే నెల నుంచి విడతలవారీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. యువత కోసం ప్రతి ఏటా లక్ష మందికి ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయలు ఇచ్చి, పది మందికి ఉపాధి కల్పించే అద్భుతమైన భవిష్యత్తు కార్యక్రమాలు ఉన్నాయని, వీటిపై జనసైనికులు ప్రతి గడపకూ వెళ్లి వివరించాలన్నారు.