పద్మవ్యూహంలో పవన్.. వైసీపీతో స్నేహబంధంపై సీరియస్
కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జనసేన పార్టీ
దిశ, ఏపీ బ్యూరో: కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా జనసేన పార్టీ పరిస్థితి తయారైంది. బీజేపీతో పొత్తును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అటు బీజేపీ నాయకత్వం సైతం జనసేనతోనే పొత్తు ఉందని.. అది కొనసాగుతుందని కూడా చెప్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని జనసేనలో కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. పైకి జనసేనతో పొత్తు అంటూనే చాపకింద నీరులా వైసీపీతోనూ చెలిమి చేస్తున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అని పదేపదే పవన్ కల్యాణ్ చెప్తున్నారు. అవసరమైతే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు సైతం సిద్ధమేనంటూ పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అయితే బీజేపీ చాటుగా వైసీపీతో స్నేహం చేయడంపై జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగితే జనసేనకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎటూ వచ్చి అది బీజేపీకే ప్లస్ అవుతుందని చెప్తున్నారు.
జనసేన వల్ల బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుందే తప్ప.. బీజేపీ వల్ల జనసేనకు సీట్లు పెరిగే అవకాశమే లేదని పార్టీలో కొందరు నేతలు చెప్తున్నారు. జనసైనికుల్లో అసంతృప్తిని తొలగించేందుకు పవన్ కల్యాణ్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వంతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్లాన్ చేస్తున్నామని త్వరలోనే బీజేపీ నాయకత్వం రూట్ మ్యాప్ ఇస్తుందని అది ఇస్తే ఇక వైసీపీకి దబిడి దిబిడే అని కూడా ప్రకటించేశారు. ఇంతలా కవర్ చేసుకుంటూ వస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో జనసేనాని ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు నై అంటే వైసీపీ జనసైనికులను టార్గెట్ చేసి కేసుల్లో ఇరికించే అవకాశం ఉంది. దీంతో పవన్ కల్యాణ్ నై అని చెప్పలేకపోతున్నారట. మరోవైపు బీజేపీ నాయకత్వాన్ని పద్ధతి మార్చుకోండని హితవు పలికే పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీతో చెలిమి అటు మింగలేక ఇటు కక్కలేక అన్న పరిస్థితికి చేరుకుంది.
వైసీపీకి కలిసొచ్చే చాన్స్
2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలి.. అవసరమైతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు టీడీపీతో కూడా అలయన్స్ పెట్టుకోవాలని కూడా జనసేన వ్యూహ రచన చేస్తున్నది. ఇవే ఎన్నికలను అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ కల. ఆ కల సాకారం అవ్వాలంటే అటు పవన్ కల్యాణ్ లేదా ఇటు సీఎం వైఎస్ జగన్ తోనే సాధ్యం అని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెలిమి కటీఫ్ అయ్యింది. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుంది. గతంలో ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిరసనలు చేపట్టేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. నారూటే సెపరేటు అన్నట్లుగా బీజేపీ.... తగ్గేదేలే అన్నట్లు జనసేన పార్టీ ఇరు పార్టీలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఒంటరిగా పోరాటం చేస్తున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
బీజేపీది మూడుముక్కలాట
దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తమ హవా కొనసాగించాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఏపీకి శ్రీకారం చుట్టింది. ఈ ఆపరేషన్ లో ప్రధానమైన వైసీపీ, జనసేన పార్టీలు చిక్కుకుపోగా పరోక్షంగా టీడీపీ సైతం ఎరకు చిక్కింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండటం కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిన పరిస్థితి. ఇకపోతే జనసేన, టీడీపీలకు రాష్ట్రంలో బేస్ ఉంది. జనాల్లో మంచి ఆదరణ సైతం ఉంది. ఇది గమనించిన బీజేపీ ఈ మూడు పార్టీలతో చెడుగుడు ఆడేస్తున్నది. ఈ పొలిటికల్ గేమ్‌లో అసలు విషయం ఏంటంటే నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ బలమైన మూడు ప్రాంతీయ పార్టీలను ఆడించడం. అధికారంలో ఉండటం వల్ల అటు వైసీపీకి, గతంలో మైత్రి వల్ల టీడీపీకి, ప్రస్తుతం పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీని వీడలేని పరిస్థితి.
నిజానికి వీడకుండా ఉండేలా బీజేపీ వేసిన స్కెచ్‌లో ఈ మూడు పార్టీలు చిక్కుకున్నాయి. ఆ పద్మవ్యూహం ఏంటంటే జాతీయ స్థాయిలో యాంటీ మోడీ క్యాంప్ ఏర్పాటైంది. కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలనే ప్రయత్నం జరుగుతున్నది. పొరుగున ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అందులో భాగస్వామి కావడం విశేషం. ఇలా దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా జట్టుకడుతున్నా అటు జనసేన, టీడీపీ, వైసీపీలు మాత్రం కిమ్మనకుండా ఉన్నాయి. ఇందులో ఆయా పార్టీల సొంత అజెండాలు కూడా ఉన్నాయనుకోండి. రాష్ట్రంలో బీజేపీతో కలిసి 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించాలన్నది టీడీపీ ప్లాన్. అదే సమయంలో బీజేపీని వైసీపీకి దగ్గర కానియ్యకుండా చూడాలన్నదే మరో వ్యూహం.
ఇకపోతే బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని సీఎం కుర్చీలో కూర్చోవాలని పవన్ వ్యూహం. ఇదిలా ఉంటే బీజేపీ, టీడీపీ అసలు కలవకూడదు అన్నది వైసీపీ ప్లాన్. ఇలా వీరు సొంత అజెండాలతో బీజేపీతో స్నేహ బంధం కొనసాగిస్తున్నారు. ఏ పార్టీ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ.. బీజేపీ చెప్పింది చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. అందుకు నిదర్శనమే కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ మద్దతు పలకడం. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే నాలుగు పార్టీల మధ్య అతి పెద్ద రాజకీయ దోబూచాట సాగుతోంది అన్నది వాస్తవం.
వైసీపీతో బీజేపీ చెలిమిపై అసహనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర టైం ఉంది. అయితే ఇప్పటి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తమ పొత్తు వచ్చే ఎన్నికలకు కొనసాగుతుందని బీజేపీ తెగేసి చెప్తున్నది. అటు జనసేనాని సైతం బీజేపీ జాతీయ పెద్దలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెదించేందుకు జాతీయ నాయకత్వం రూట్ మ్యాప్ కూడా ఇస్తాను అని హామీ ఇచ్చిందని బహిరంగ వేదికలపై కూడా పవన్ స్పష్టం చేశారు. బీజేపీ రూట్ మ్యాప్ ఎంత త్వరగా ఇస్తే పని అంత ఫాస్ట్‌గా మెుదలు పెడతానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాలంతో పాటు రాజకీయాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే బీజేపీతో జనసేన సఖ్యతగా లేదనే ప్రచారం జరుగుతుంది. అందుకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు జనసేనాని హాజరుకాకపోవడం ఒకటి అయితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు పలు దఫాలుగా పర్యటించిన సందర్భంలో ఏనాడూ పవన్ కల్యాణ్‌తో భేటీ కాకపోవడం మరోక అంశం. ఇదంతా ఒక ఎత్తైతే వైసీపీతో చెలిమి పెంచుకోవడం జనసేనకు మింగుడు పడని అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే గతంలో పవన్ కల్యాణ్ పొత్తులపై బీజేపీ, టీడీపీలకు మూడూ ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి సింగిల్‌గా జనసేన పోటీ చేయడం లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడం, లేదా బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయడం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మళ్లీ లాభపడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఒక కూటమిలా ఏర్పడి పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదు. అలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తే 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే చాన్స్ లేకపోలేదని పొలిటికల్ సర్కిల్ టాక్.
స్పీకర్ పై పేపర్లు విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏపీ అసెంబ్లీలో టెన్షన్