ఏం మాట్లాడుతున్నావ్ జగన్.. అంటూ మంత్రి రాంప్రసాద్ తీవ్ర ఆగ్రహం

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-07-04 12:04 GMT

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని నెల్లూరు జైలులో పరామర్శించడానికి వెళ్లిన జగన్.. ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు. వెళ్లిన పని చేసుకొని రావాలని గానీ.. ప్రభుత్వం విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. అసలు జగన్ ఏం మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్‌కు అవకాశం లేకపోయినా మాజీ సీఎం కదా అని అనుమతిచ్చామన్నారు. కానీ జైలు వద్ద సీఎం చంద్రబాబుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుకుని కేసుల నుంచి తప్పించుకున్న జగన్.. త్వరలో జైలు వెళతాడని హెచ్చరించారు. తాము అధికారంలోకి 21 రోజులే అవుతుందని.. ఇంతలోనే ప్రభుత్వం ఏమీ చేయలేదనే మాటలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే ఐదు హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా తాము అధికారంలోకి పింఛన్‌ను పెంచామని, చెప్పినట్లుగా మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేశామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 


Similar News