టీడీపీలోకి భారీ చేరికలు.. మారనున్న రాష్ట్ర రాజకీయాలు
ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయి
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న ఈ సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయి. అధికార వైసీపీకి రా.. కదలిరా సభా వేదికగా ఊహించని షాక్ తగలనుంది. వైసీపీ అభ్యర్ధుల మార్పులతో టికెట్ దక్కకపోయిన నేతలతో పాటు రాష్ట్రంలోని వైసీపీలో కీలకంగా వ్యవహరించే నేతలు సైతం పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. వీరంతా రేపు నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో జరగబోయే టీడీపీ రా.. కదలిరా సభల్లో కార్యకర్తలు, అభిమానులతో కలిసి మూకుమ్మడిగా టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు, గురజాలలో రా.. కదలిరా సభలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల్లో ఇటీవలే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, మరో వైసీపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. వీరికీ టీడీపీ నుంచి టికెట్లు దాదాపు ఖరారు అయినట్లు తెలిసింది. వారితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, మానుగుంట మహీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన సహా వందల సంఖ్యలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డ్ మెంబర్లు, సర్పంచులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీకి దూరం కాగా, ఈ చేరికలతో నెల్లూరు వైసీపీ ఖాళీ కానున్నట్లు తెలుస్తొంది.
వీరితో పాటు మరికొందరు కీలక నేతలతో చర్చలు జరిపి వారిని కూడా చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలు చంద్రబాబు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వేమిరెడ్డికి అప్పగించినట్లు తెలుస్తొంది. ఇందులో భాగంగానే వేమిరెడ్డి నిన్న మానుగుంటతో చర్చలు జరిపారు. అలాగే మరికొందరు నేతలకు కూడా టచ్ లో ఉన్నట్లు తెలుస్తొంది. దీంతో రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే నాయకుల చేరికలతో వైసీపీ అధిష్టానానికి పెద్ద దెబ్బ తగిలినట్లు అవుతుందని, అలాగే ఇప్పటికే వైసీపీపై వ్యతిరేఖతతో ఉన్న ప్రజలకు వైసీపీ దాదాపు ఖాళీ అయ్యిందనే సంకేతం పంపితే.. టీడీపీ, జనసేన కూటమి గెలుపుకు మరింత దగ్గర అవుతుందనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
Read More..
టీడీపీ-జనసేన కూటమికి బిగ్ షాక్.. పొత్తుపై బీజేపీ ఝలక్ ఇదే..!