మారేడుమిల్లిలో ఐదుగురు విద్యార్థులు మృతి.. ఏడుగురి కోసం గాలింపు
రాజమండ్రిలోని మారేడుమిల్లిలో ముగ్గురు వైద్య విద్యార్థులు, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు నీట మునిగి మరణించిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలోని మారేడుమిల్లిలో ముగ్గురు వైద్య విద్యార్థులు, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు నీట మునిగి మరణించిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) జగదీష్ అడహల్లి తెలిపిన వివరాల ప్రకారం.. విహారయాత్రలో భాగంగా ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాలకు చెందిన 14 మంది మెడికోలు ఆదివారం ఉదయం మారేడుమిల్లిని సందర్శించి జలతరంగిణి జలపాతాల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే వారిలో ముగ్గురు వైద్య విద్యార్థులు సీహెచ్ హరదీప్, కే సౌమ్య, బీ అమృతలతో పాటు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. మరో ముగ్గురు మెడికల్ విద్యార్థినులు హరిణి ప్రియ, బొట్నూరి ప్రజ్ఞ, గాయత్రి పుష్పలను సుక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం జలపాతం వద్ద మిగిలిన ఏడుగురిని కాపాడే పనిలో భాగంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (NDRF) బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ASP తెలిపారు. ఈ ప్రాంతం దట్టమైన అడవి కావడంతో భారీ వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆసుపత్రిని సందర్శించి ఇద్దరు వైద్యాధికారులతో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.