విశాఖకు మహర్దశ: విమానయాన సంస్థల ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖ మారబోతుంది.

Update: 2023-11-02 11:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖ మారబోతుంది. విశాఖ పరిపాలన రాజధాని కానుండటంతో ఆ ప్రాంతానికి మహర్ధశ పడుతుంది. ఇప్పటికే అనేక కంపెనీలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విమానయాన సంస్థలు సైతం విశాఖవైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. విశాఖ నుంచి ప్రయాణికుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు విశాఖపట్నానికి స్పైస్‌ జెట్‌ ఐదు, ఇండిగో సంస్థ రెండు విమాన సర్వీసులు నడపడానికి అనుమతులు తెచ్చుకున్నాయి. ఈ విమానాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతో పాటు ఒడిశాలోని జార్సిగుడ ఎయిర్‌పోర్టుకు కూడా నడపడానికి సంబంధిత సంస్థలు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్పైస్‌ జెట్‌ హైదరాబాద్, కోల్‌కతా, జార్సిగుడలకు డైలీ సర్వీసులను నడపనుంది. చెన్నై, బెంగళూరులకు వారంలో మూడు, నాలుగు రోజులు చొప్పున సర్వీసులు నడపనుంది. ఇకపోతే ఇప్పటి వరకు విశాఖ నుంచి జార్సిగుడకు విమాన సర్వీసులు లేవు. జార్సిగుడ ఇండస్ట్రీయల్ ఏరియా కావడంతో తొలిసారి స్పైస్ జెట్ సంస్థ జార్సిగుడకు విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించింది. విశాఖ-జార్సిగుడల మధ్య ప్రయాణికుల డిమాండ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో స్పైస్ జెట్ సంస్థ తమ విమాన సర్వీసులను నడిపేందుకు ఆసక్తి చూపిస్తుంది.

ఈ నెల నుంచి ఇండిగో సర్వీసులు

ఇండిగో సంస్థ కోల్‌కతా, బెంగళూరులకు రోజూ తమ విమానాలను నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్పైస్‌ జెట్‌ సంస్థ జనవరి నుంచి విశాఖకు తమ సర్వీసులను నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండిగో సంస్థ నవంబర్‌ 15 నుంచి కోల్‌కతాకు, 16 నుంచి బెంగళూరుకు నడపనుంది. కోల్‌కతా సర్వీసు సాయంత్రం 6.55 గంటలకు, బెంగళూరు సర్వీసు ఉదయం 10.30 గంటలకు బయలుదేరనున్నట్లు తెలియజేసింది. ఒకప్పుడు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ అత్యంత రద్దీగా ఉండేది. కరోనాకు ముందు ఏటా 2.85 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. అనంతరం సర్వీసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం మళ్లీ సర్వీసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరికి ప్రయాణికుల సంఖ్య 3 మిలియన్లకు చేరుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

విశాఖ-శ్రీలంక సర్వీసుల పునరుద్ధరణ

కరోనా కంటే ముందు శ్రీలంక–విశాఖల మధ్య సర్వీసులు ఉండేవి. 2017లో కొలంబో–విశాఖ మధ్య శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ తమ విమాన సర్వీసును ప్రారంభించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సర్వీసు రద్దు అయ్యింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ నుంచి సింగపూర్‌కు ఒకే ఒక్క అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోంది. గతంలో బ్యాంకాక్, దుబాయ్‌లకు సర్వీసులు ఉన్నప్పటికీ అవి నిలిచిపోయాయి. కొలంబో సర్వీసును కూడా పునరుద్ధరిస్తే ఈ ఎయిర్ పోర్టు నుంచి రెండు అంతర్జాతీయ సర్వీసులు నడిచినట్లు అవుతుంది.

Tags:    

Similar News