రొయ్యల సాగులో నష్టాలు.. దంపతుల ఆత్మహత్య

రొయ్యల సాగు వస్తే లక్షలే..పోతే లక్షలే. అందుకే రొయ్యల సాగు చేసేవారు ఆచితూచి అడుగులు వేస్తుంటారు.

Update: 2023-12-13 07:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రొయ్యల సాగు వస్తే లక్షలే..పోతే లక్షలే. అందుకే రొయ్యల సాగు చేసేవారు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. ఏమాత్రం తేడా వచ్చిన ఇక ఆత్మహత్యే శరణ్యం. ఒకవేళ లాభం వచ్చిందంటే ఇక అదృష్టం పట్టినట్లే. ఇలానే లాభం వస్తుందనే ఆశతో ఓ వ్యక్తి రొయ్యలసాగులోకి దిగాడు. అయితే రొయ్యలసాగులో నష్టం రావడంతో 10 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక భార్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ‘అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం’ అంటూ దంపతులు సూసైడ్‌నోట్ రాసి మరీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పరసా మాతనాగబాబు (30)కు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష (28)కు 2015లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. అయితే నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

ప్రాణాలు తీసిన అప్పు

నాగబాబు సాగు చేసే చెరువు లీజు ఈ ఏడాది జూన్‌తో పూర్తి అయ్యింది. అప్పటికే నాగబాబు రొయ్యలసాగులో నష్టం రావడంతో రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యాడు. దీంతో భార్య నగలను తాకట్టు పెట్టి కొంత.. తండ్రి కొంత అమౌంట్ సర్ధుబాటు చేయడంతో అప్పులు తీర్చాడు. అయినప్పటికీ మరింత అప్పు తీర్చాల్సి ఉంది. దీంతో నాగబాబు చెరువులు జోలికి వెళ్లకుండా సింగరాయపాలెంలోని ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. మరోవైపు 3నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి పెట్టించారు. అయితే మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దంపతులు ఇంట్లో పైకప్పునకు రెండు చీరలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి సాయంత్రం తలుపులు తెరిచి చూడగా కోడలు, కొడుకు విగజీవులుగా ఇంటి దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన ఆ చిన్నారులు బోరున విలపించారు. కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌, ఎస్‌ఐ వెంకటకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సూసైడ్‌నోట్‌లో ఏముందంటే

దంపతులు జీవిస్తున్న ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది.‘అమ్మా, నాన్నా క్షమించండి, మాకు బతకడం ఇష్టం లేదు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త. మా ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇవ్వండి.హెల్ప్‌ అవుతుంది’ అని ఆ దంపతులు సూసైడ్ నోట్‌లో రాశారు. అంతేకాదు‘మా వల్ల ఎవరూ గొడవ పడొద్దని సూచించారు. ఇంట్లో అప్పులు, ఈఎంఐ వంటి ఇతర అంశాలను సైతం లేఖలో పొందిపరిచారు. దంపతుల ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. 


Similar News