సహానా కుటుంబానికి జగన్ పరామర్శ.. యువతిపై లైంగికదాడి?

రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రెడ్ బుక్ (Red Book) పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్.

Update: 2024-10-23 07:13 GMT

దిశ, వెబ్ డెస్క్: రౌడీషీటర్ నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ కు గురైన యువతి సహానా (Sahana Murder) గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతిచెందింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీజీహెచ్(GGH) లో ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వైసీపీ తరపున ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ వివిధ దాడులలో మరణించిన ఆరుగురు ఆడపిల్లల కుటుంబాలకు పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. షరామామూలుగానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రెడ్ బుక్ (Red Book) పాలన సాగుతోందని దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహానా మృతదేహాన్ని పరిశీలించిన తనకు శరీరంపై కమిలిన గాయాలు కనిపించాయన్నారు. ఆమెపై లైంగిక దాడిచేసి, ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయారని ఆరోపించారు. ఇంతవరకూ హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఎవరూ బాధితురాలిని పరామర్శించలేదన్నారు. తాను వస్తున్నానని తెలిసి.. వాళ్లు కూడా పరామర్శకు వస్తున్నట్లు తెలిసిందన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో దళిత మహిళలను చూస్తే అర్థమవుతుందన్నారు. వైసీపీ హయాంలో ఆడవాళ్లకు భద్రత ఉండేదని, దిశ యాప్ (Disha App)తో ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచామన్నారు. సహానా మృతికి కారణమైన నవీన్ టీడీపీకి చెందిన వాడని, అతను స్థానిక ఎంపీతో సన్నిహితంగా ఉండేవాడన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని, నిందితుడు తమపార్టీకి చెందినవాడు కావడంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అతన్ని కాపాడాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. 

కాగా.. నిందితుడు నవీన్ ను తెనాలి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. టీడీపీకి, నవీన్ కు ఏ సంబంధం లేదని, సహానా - నవీన్ ల మధ్య అప్పు విషయమై జరిగిన గొడవే ఆమె హత్యకు దారితీసిందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అంత క్లారిటీగా చెప్పినా వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 

Tags:    

Similar News