ఇన్‌చార్జిలతోనే లొల్లి : వైసీపీలో అసమ్మతికి కారణం ఇదేనా?

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

Update: 2023-12-11 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా వ్యూహరచన చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఇలాంటి తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగలు తగులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న అనేక నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుముంటుంది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంటే మరోవైపు నేతల అలకలు, అసమ్మతి జ్వాలలతో వైసీపీలో గందరగోళం నెలకొంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఈ అసమ్మతి సెగ మరోసారి భగ్గుమంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఇలా అసమ్మతితో రగిలిపోతుంటే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. అయితే ఈ అసమ్మతికి నూతన ఇన్‌చార్జిల నియామకాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది.

ఇన్‌చార్జిల నియామకాలతోనే లొల్లి

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ వై నాట్ 175 అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు నిత్యం ప్రజల్లో ఉండేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయంగా బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో నేతలు అసమ్మతితో పార్టీని వీడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడటానికి, అసమ్మతి బాహుటా ఎగురవేయడానికి ఇన్‌చార్జిల నియామకాలే కారణమని తెలుస్తోంది. పలు సర్వేలలో పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కొత్త వారిని ఇన్‌చార్జిలుగా నియమిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఇన్‌చార్జి మార్పు నేపథ్యంలో మెుదలైన అసంతృప్తి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మెుదలైంది. ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి కొనసాగుతుండగానే తాడికొండ వైసీపీ ఇన్‌చార్జిగా మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నియమించడంతో ఈ అసంతృప్తి జ్వాల మెుదలైంది.

చిరంజీవికి బాధ్యతలు అప్పగించడంతోనే

అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెను పార్టీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీకి మద్దతు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవితోపాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వైసీపీ వేటేసింది. వీరంతా అసమ్మతితో పార్టీ వీడటానికి కూడా కొత్త ఇన్‌చార్జిలను నియామకమే అందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం ఇదే కోణంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించడంతోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News