Yuvagalam: పల్లె కన్నీరు తుడుస్తాం: Nara lokesh
సీఎం జగన్ పాలనతో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని, టీడీపీ అధికారంలోకి రాగానే తుడుస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు....
దిశ, కర్నూలు ప్రతినిధి/మంత్రాలయం: సీఎం జగన్ పాలనతో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని, టీడీపీ అధికారంలోకి రాగానే తుడుస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారు నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర సుగురు, చెట్లపల్లి, వగరూరు, వీ.తిమ్మాపురం, మంత్రాలయం, కల్లుదేవ కుంట మీదుగా సాగింది. పాదయాత్రలో భాగంగా మాధవరం శివారులో లోకేష్‌ను లింగమ్మ అనే మహిళా రైతు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు మూడెకరాల పొలం ఉందని, ఎకరా పొలంలో టమోటా, రెండెకరాల్లో చెరుకు పంట వేశామన్నారు. టమోటా సాగుకు ఎకరాకు రూ.70 వేలు ఖర్చు చేస్తే రూ.10 వేల దిగుబడి వచ్చిందన్నారు. కానీ పంటలు నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోలేదని కన్నీటి పర్యాంతమయ్యారు. టీడీపీ హయాంలో పంట నష్టం వాటిల్లితే రూ.70 వేల పంటబీమా వచ్చిందని ఆమె గుర్తు చేశారు.
టమోటా రైతులకు లోకేశ్ కీలక హామీ
అందుకు నారా లోకేష్ స్పందిస్తూ టమోటా రైతులను ఆదుకోవడానికి కెచ్చాప్ ఫ్యాక్టరీలు పెడతానన్న జగన్ పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పంటల బీమాకు ప్రభుత్వం ఇన్సురెన్స్ కంపెనీలు పెడుతుందని చెప్పి అన్నదాతలను నట్టేట ముంచారని మండిపడ్డారు. పశ్చిమ ప్రాంతంతో పాటు రాయలసీమలో అనేక కుటుంబాలు వలసలు వెళ్తుంటే పల్లె కన్నీరు పెడుతుందన్నారు. ఇంటిల్లిదిపాది మండు టెండల్లో పని వెతుక్కుంటూ వెళ్లి పనులు చేసుకుని తిరిగొస్తుచ్చే దృశ్యాలు ఆందోళన కలిగించాయని చెప్పారు. బడిలో చక్కటి రాతలు నేర్వాల్సిన చిట్టి చేతులు మట్టి పనులకు తల్లిదండ్రులతో తరలిపోతున్నారన్నారు. మెతుకు కోసం, బతుకు కోసం వందల కిలోమీటర్లు ప్రమాదకర ప్రయాణం చేస్తున్న వలస జీవుల బాధలు అన్ని ఇన్ని కావన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వ్యవసాయానికి నీరందిస్తామని హామిచ్చారు. స్థానికంగా ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషించి వలస కష్టాలు తీరుస్తామని భరోసా కల్పించారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.
బీసీలతో ముఖాముఖీ
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో లోకేష్ బీసీలతో ముఖాముఖీ నిర్వహించారు. తమ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు. అలాగే లోకేష్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు పలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మంత్రాలయంలో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని, రాష్ర్టంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అలాగే అనాధ పిల్లలకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించారు. అంతకుముందు రహదారి వెంట ఉన్న పంటలను పరిశీలించారు. రాత్రి సమయానికి నందవరం చేరుకున్నారు. అక్కడే బస చేసి తిరిగి నేడు ఉదయం పాదయాత్ర ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.