సీల్ వేసిన మద్యం మాయం.. పోలీసుల రూపంలో కొత్త చిక్కులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల్లో పని చేసిన సిబ్బందికి ఎక్సైజ్ పోలీసుల రూపంలో కొత్త చిక్కులొచ్చిపడ్డాయి....
దిశ ప్రతినిధి, కర్నూలు: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల్లో పని చేసిన సిబ్బందికి ఎక్సైజ్ పోలీసుల రూపంలో కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. టీడీపీ ప్రభుత్వం కొత్త నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టిన తరువాత, సిబ్బంది ఎక్సైజ్ పోలీసులకు మిగిలిన స్టాక్‌ను అప్పగించారు. అయితే సీల్ వేసిన దాదాపు రూ.16,740 విలువ చేసే మద్యం మాయమైనట్లు సమాచారం. ఆ నెపాన్ని సిబ్బందిపై వేసే యత్నం చేస్తున్నట్లు తెలిసింది. కానీ, ఆ వ్యూహం బెడిసికొట్టడంతో చేసేదిలేక మూడో కంటికి తెలియకుండా ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నాడు 12 గంటల డ్యూటీ..
గత వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మద్యం దుకాణాల్లో దాదాపు 12 వేల మందిని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రతి రోజు 12 గంటల పాటు విధులు నిర్వహించేవారు. నిబంధనల ప్రకారం 8 గంటల పని చేయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా లాభార్జన కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం పని చేయించుకుంది. ఇంత చేసినా వీరికి ఉద్యోగ భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఆ సమయంలో వారికి నెల వేతనం వేస్తామని హామీచ్చింది. కానీ సగం వేతనంతో సరిపెట్టింది.
ఎక్సైజ్ పోలీసుల అత్యుత్సాహం
కర్నూలు జిల్లా కేంద్రంలో 13108 నెంబర్ గల ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్ వైజర్, నలుగురు సేల్స్ మెన్లు పని చేసేవారు. వారు స్టాక్ ను అప్పటించే సమయంలో ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తన సిబ్బందితో స్టాక్ ను పరిశీలించి పంచానామా నిర్వహించారు. అక్కడ 6,103 మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.22,31,760 ఉన్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత స్టాక్ రూంను పోలీసులకు అప్పగించడంతో వారు తాళాలు వేశారు. ఆ తర్వాత అక్కడ ఎలాంటి రిమార్కు లేదని పత్రాలు కూడా సిబ్బందికి ఇచ్చారు. కానీ సీల్ వేసిన మద్యం స్టాక్ నుంచి ఎక్సైజ్ పోలీసులు రూ.16,740 విలువ చేసే 20 బాటిళ్ల మద్యాన్ని తీసుకెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఈ డబ్బును మద్యం దుకాణంలో పని చేసే సిబ్బంది నుంచి వసూలు చేయాలని యోచించారు. వారికి వచ్చే వేతనాన్ని పట్టుకుని ఇవ్వాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ఎక్సైజ్ డిపోలో వేతనాల బిల్లు పెట్టే సిబ్బందికి వారికి వేతనాలు వేయొద్దని చెప్పినట్లు సమాచారం. అందుకే మొన్న చాలా మందికి సగం వేతనం వేసింది.
కానీ ఈ దుకాణానికి చెందిన వారికి మాత్రం వేయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది అధికారులను సంప్రదించారు. 20 బాటిళ్లు తేడా వస్తున్నాయని, వాటికి సంబంధించిన రూ.16,740 చెల్లిస్తేనే వేతనాలు వేస్తామని చెప్పినట్లు బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయంపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబును వివరణ కోరగా డిపోలో సంప్రదించాలని చెప్పారు. అలాగే డీపో మేనేజర్ శ్రీధర్ రావును వివరణ కోరగా ఆ సిబ్బంది తమను సంప్రదిస్తే అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పారు. అలాగే ఎక్సైజ్ సీఐ చంద్రహాస్‌ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు