వైసీపీలో నైరాశ్యం.. పక్క చూపులు చూస్తున్న నేతలు
2019 ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్విప్ చేసిన వైసీపీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది....
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీలో నైరాశ్యం ఆలముకుంది. ఆ పార్టీ శ్రేణులకు నేతలు ఎలాంటి భరోసా కల్పించకపోవడంతో పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. ఇన్‌చార్జులు, నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న నేతలు నియోజకవర్గ, మండల స్థాయి నేతలను విస్మరించడమే కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా సారథులకు పరిస్థితులు సవాల్‌గా మారాయి.
దిశ ప్రతినిధి, కర్నూలు: 2019 ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్విప్ చేసిన వైసీపీ, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. 12 టీడీపీ కూటమి గెలుచుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కోడుమూరు, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరంతా అప్పుడప్పుడు మినహాయిస్తే పూర్తిస్థాయిలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, పైగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నేతలకు భరోసా కల్పించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో జిల్లా సారథులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిలు నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఆశించిన స్థాయిలో పురోగతి కన్పించడం లేదని తెలుస్తుంది. కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
స్థానిక రగడ
వైసీపీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చినా, నియోజకవర్గాల ఇన్‌చార్జులు సమాచారం ఇవ్వడం లేదని స్థానిక నేతలు వాపోతున్నారు. అందుకు మొన్న రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చేపట్టిన నిరసన కార్యక్రమం ఓ ఉదాహరణ. జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణులను సమీకరించడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదే క్రమంలో ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత ఇన్‌చార్జుల బదిలీ ప్రక్రియ కలిసి రాలేదు. ఎక్కడైతే స్థానికులను కాదని స్థానికేతరులకు టికెట్ ఇచ్చారో, ఆయాచోట్ల పార్టీ ఓటమి పాలైంది. అప్పటి నుంచే పార్టీ శ్రేణులు స్థానికేతరులను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జుల మార్పు చేర్పులు చేపడతామని ప్రకటించిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేర్పులు చేపట్టలేదు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది.