Nara Lokesh: తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు..

టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ..

Update: 2023-04-16 17:15 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం పత్తికొండ నియోజకవర్గం రాంపల్లిలో లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వైసీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని, వచ్చే ఆదాయంతో బతకడం కష్టంగా మారిందని మహిళలు లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో పనుల్లేక వలసలు వెళ్తున్నారని, గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి ప్రస్తావించారు. వారి సమస్యలపై లోకేశ్ సానుకూలంగా స్పందించారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, అలాగే జగన్ పెంచిన పన్నుల భారాన్ని కూడా తగ్గిస్తామంటూ గ్రామస్తులకు లోకేశ్ హామీచ్చారు. తర్వాత రామకొండ క్రాస్ దగ్గర నారా లోకేష్ యువకులతో సమావేశమయ్యారు. అలాగే మారెళ్లలో రైతులతో సమావేశమయ్యారు. మారెళ్ల శివారులో బీసీలతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని తెలిపారు.

అందులో భాగంగానే బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని నారా లోకేశ్ గుర్తు చేశారు. అక్రమ కేసులతో బీసీలను జగన్‌ సర్కార్‌ వేధిస్తోందని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్‌ ను జగన్‌ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక్క అవకాశం అనగానే మోసపోయి ప్రజలు తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీసీలను అణిచివేసేందుకు జగన్‌ అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తెస్తామని ప్రకటించారు. అంతకుముందు రైతులు లోకేశ్ కు నాగలిని బహూకరించారు. రాత్రి ఈ యువగళం పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఎంకే కొట్టాల వద్ద లోకేశ్ రాత్రి బస చేయనున్నారు.

సీమలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: లోకేశ్‌

రాయలసీమలో నీటి సమస్య పరిష్కారానికి మాజీ సీఎం చంద్రబాబు కృషి చేశారని నారా లోకేశ్ తెలిపారు. సీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రూ.11 వేల కోట్లు ఖర్చుచేస్తే..జగన్ గత నాలుగేళ్లలో 10 శాతం కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. డ్రిప్ ఇరిగేషన్ కట్ చేసి సీమ రైతులను కోలుకోలేని దెబ్బతీశారన్నారు. కరువు సీమను దృష్టిలో ఉంచుకుని రాయలసీమలో పెండింగ్‌ లో ఉన్న ప్రాజెక్టులన్నీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వైసీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పన్నులను కూడా తగ్గించనున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్రలో నియోజకవర్గ ఇంచార్జి కేఈ శ్యాంబాబు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, బీసీ జనార్థన్ రెడ్డి, కేఈ సోదరులు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News