Nara lokesh: సైకో జగన్‌ను ఇంటికి సాగనంపుదాం!
సైకో జగన్‌ను ఇంటికి సాగనంపుదామని, అందుకు సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ చైతన్యమై ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ..
దిశ, కర్నూలు ప్రతినిధి: సైకో జగన్‌ను ఇంటికి సాగనంపుదామని, అందుకు సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ చైతన్యమై ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో కొనసాగింది. అనంతరం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. శ్రీశైలం ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రతి పనిలో కమీషన్ తీసుకునే శిల్పాకు మరో పేరు చీటింగ్ శిల్పా అని కొత్తపేరు పెట్టారు. శ్రీశైలం గడ్డపై పచ్చజెండా ఎగరేద్దామా అంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తమ ప్రభుత్వంలో ఎవరినీ వదలమని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తీర్చుకుంటామన్నారు.
‘వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి. కల్తీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని, రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండేలా చూడాలని, 50ఏళ్లు నిండిన ప్రతి రైతు, కౌలు రైతులకు రూ.3 వేలు పెన్షన్ ఇవ్వాని, రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలి.’ అని లోకేష్‌ను రైతులు కోరారు. అందుకు స్పందించిన లోకేష్ జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రం జాతీయ స్థాయిలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలచిందన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గొలుసుకట్టు చెరువులకు నీరందించి సాగునీటి సమస్య పరిష్కరిస్తామని, కల్తీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ఏపీసీడ్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తామని తెలియజేశారు.
నంద్యాలలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలి : న్యాయవాదులు
నూతనంగా ఏర్పాటైన నంద్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని, అదే క్రమంలో ఆత్మకూరులో అడిషనల్ జిల్లా జడ్జీ కోర్టు ఏర్పాటు చేయాలని ఆత్మకూరు న్యాయవాదులు కోరారు. ఈ మేరకు పాదయాత్రగా వస్తున్న లోకేష్ ను న్యాయవాదులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1178 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆత్మకూరుకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం మండలం కూడా ఈ కోర్టు పరిధిలోనే ఉందని, ఆత్మకూరులో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. కోర్టు నిర్మించి 35 ఏళ్లు అయినందున బిల్డింగులు, జడ్జీల నివాస భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.