Ap News: నంద్యాలలో దారుణం... బాలికతో పనులు
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారిని పని వారుగా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ చిన్నారులనే కనికరం లేకుండా పనులు చేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. .
దిశ, పాణ్యం: విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారిని పని వారుగా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ చిన్నారులనే కనికరం లేకుండా పనులు చేయించడం పలు విమర్శలకు తావిస్తోంది. అలాంటి ఘటన నంద్యాల రోజాకుంట కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది. పాఠశాల ఆవరణలో ప్రభుత్వం అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు చేపట్టింది. గోడలకు సిమెంట్‌తో క్యూరింగ్ చేశారు. వీటికి కూలీలతో పనులు చేయించాల్సిన కాంట్రాక్టర్, ఉపాధ్యాయులు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని భావించి పిల్లలతో పని చేయిస్తున్నారు. వినకపోతే పిల్లలను దూషించడం, కొట్టడం వంటి పనులకు ఉపక్రమించడంతో చిన్నారులు భయపడుతూ నీరు పోస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని, పిల్లలతో పని చేయించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సీపీఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు.