భూమా వర్సెస్ గంగుల.. ఆళ్లగడ్డలో రాజకీయం రసవత్తరం

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సెగ్మెంట్ రాజకీయ రణరంగానికి వేదికైంది. ...

Update: 2023-10-30 02:21 GMT

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఎవరికి వారు ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ఎవరేం చేశామో తేల్చుకుందామంటూ సవాల్ విసుకుంటున్నారు. కేసీ ఆయకట్టు రైతులను ఆదుకోకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని భూమా అంటుంటే.. మంత్రిగా ఉన్నప్పుడు అఖిలప్రియ ఏం చేశారంటూ గంగుల ఎదురుదాడికి దిగుతున్నారు. ఎన్నికలు మరి కొద్ది నెలల్లో ఉండగా అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధంతో ఆళ్లగడ్డ రాజకీయం రసవత్తరంగా మారింది.

దిశ, కర్నూలు ప్రతినిధి: ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సెగ్మెంట్ రాజకీయ రణరంగానికి వేదికైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి నియోజకవర్గంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టిన మహిళా నాయకురాలిగా జిల్లాలో చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై గళమెత్తుతున్నారు. అదే క్రమంలో కేసీ ఆయకట్టుకు నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల బాధలు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

స్పందనలో ఎమ్మెల్యేనా ?

మూడు రోజుల క్రితం దోర్నిపాడు మండలంలో స్పందన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి అక్కడక్కకు వెళ్లారు. స్పందన వేదికపై ఎమ్మెల్యే గంగుల ఉండడంతో భూమా అఖిలప్రియ మండిపడ్డారు. స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూర్చోవడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే పక్కన ఉంటే కలెక్టర్‌కు ప్రజలు ఎలా సమస్యలు చెప్పుకుంటారని నిలదీశారు. దమ్ముంటే జిల్లాకు రావాల్సిన నీటి వాటాల కోసం పోరాడాలని హితవు పలికారు.

మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు ?

నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి సూటిగా బదులిచ్చారు. తాము ప్రజల కోసం పని చేస్తున్నామని అంటున్నారు. ఇక స్పందన కార్యక్రమంలో పాల్గొనడంపై స్పందించారు. ప్రొటోకాల్‌తో పాటు తమ ప్రాంతానికి కలెక్టర్, అధికారులు వచ్చారని, వారిని రిసీవ్ చేసుకునేందుకే వచ్చామని సమాధానమిచ్చారు. అదే సమయంలోనే మంత్రిగా ఉన్నప్పుడు తమరేం చేశారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నిలదీశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని, త్వరలో ప్రజలే ఎవరికి బుద్ధి చెబుతారో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News