Ycp Group Politics: నందికొట్కూరు ఎమ్మెల్యే అనుచరులపై దాడి
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ..
- దాడికి ఎస్ఐ కారణమంటూ బాధితుల ఆరోపణ
- పెన్షన్ పంపిణీలో వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం
- దాడిలో కారు అద్దాలు ధ్వంసం
- బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్థర్
- బాధితులను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
దిశ, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గీయులు బాహాబాహికి దిగి దాడులు చేసుకున్న ఘటన నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే ఆర్థర్ ఎదుట బాహాబాహికి వైసీపీ నాయకులు దిగడంతో పెన్షన్ పంపిణీకార్యక్రమానికి వచ్చిన ప్రజలు విస్తుపోయారు.
పింఛన్ పంపిణీ వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రమైన పగిడ్యాలలో నిర్వహించిన కార్యక్రమానికి గురువారం ఎమ్మెల్యే ఆర్థర్ హాజరయ్యారు. సమావేశంలో వేదికపైకి ఎంపీడీఓ వెంకట రమణ ప్రజా ప్రతినిధులు, నాయకులకు ఆహ్వానం పలికారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డిని వేదికపైకి ఎంపీడీఓ ఆహ్వానిస్తుండగా ఎమ్మెల్యే వర్గీయులు జయ రామిరెడ్డి అడ్డు చెప్పారు. ప్రొటోకాల్ పాటించాలని అధికారులపై ఆగ్రహం చెందారు. సిద్దార్థ రెడ్డి వర్గీయులు మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు జయ రామిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు.
అయితే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌కు రావాలని ఎస్ఐ నాగార్జున జయ రామిరెడ్డిని పిలిపించారు. స్టేషన్‌లో ఎస్ఐతో మాట్లాడి తిరిగి నందికొట్కూరు వస్తుండగా కొత్త ముచ్చుమర్రి గ్రామ శివారులో సిద్దార్థ రెడ్డి వర్గీయులు దారి కాసి కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు బాధితులు జయరామిరెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి తెలిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే అనుచరుడు ఉదయ్ కిరణ్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన గురించి తెలుసుకున్న ముచ్చుమర్రి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దాడిలో తీవ్రంగా గాయపడిన జయరామిరెడ్డిని 108 వాహనంలో హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మండల కేంద్రమైన మిడుతూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు దాడి విషయం తెలియడంతో హుటాహుటిన ఎమ్మెల్యే నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.