Kurnool: మేం బతికేదెట్లా సారూ..!
గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు వేతన వెతలు తప్పడంలేదు...
దిశ, కర్నూలు ప్రతినిధి: గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు వేతన వెతలు తప్పడంలేదు. పాలకుల పుణ్యమాని వేతనాలకు నోచుకోవడంలేదు. ఇచ్చే అరకొర వేతనాలు కూడా పది నెలలుగా ఇవ్వకపోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారింది. వేతనాల ప్రస్తావన తెస్తే వారిని వేధింపులకు గురి చేసి మరీ తొలగించడం పాలకులకు పరిపాటిగా మారింది. కార్మికులకు అండగా ఉండాల్సిన అధికారులు పాలకులతో చేతులు కలపడం వల్ల కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వేతనాల గురించి అడగలేక కొందరు పస్తులుంటే..కొందరు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తే మరి కొందరు మానేసి కూలీ పనులకెళ్తున్నారు. తమకు వేతనాలు చెల్లించాలని ప్రజా సంఘాల సహకారంతో నిరసనలు చేశారు. అయినా పాలకుల్లో చలనం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కార్మికులు రాష్ర్ట వ్యాప్త ఆందోళనలకు సిద్ధమౌతున్నారు.
ఏపీలో దాదాపు 30 వేల మంది స్వచ్ఛ భారత్ కార్మికులు, 60 వేల మంది పారిశుధ్య కార్మికులు, చెత్తసేకరణ వాహన డ్రైవర్లు్ దాదాపు 12 వేల మంది ఉన్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులైన క్లాప్ మిత్ర, షెడ్ మిత్రలు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికెళ్లి చెత్త సేకరణ చేసి వాటిని గ్రామాల శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో వదిలేస్తారు. అక్కడ వీరు ఇంటింటి నుంచి సేకరించిన చెత్తలో తడి, పొడి చెత్తతో పాటు సీసలు, ఇతర ఘన పదార్థాలను వేర్వేరు చేస్తారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 14వ, 15వ ఆర్థిక సంఘాల నుంచి విడుదలైన నిధుల నుంచి నెలకు రూ.6 వేల చొప్పున వేతనాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏడాదిలో కేవలం 2 నెలలు మినహా పది నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు. వీరంతా ప్రతి రోజు తమకు కేటాయించిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నప్పటికీ వేతనాలివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి ఉద్యోగాలకు ఎలాంటి భద్రత లేకపోవడంతో వేతనాలు అడిగేందుకు జంకుతున్నారు. ఎప్పుడైనా వస్తాయనే నమ్మకంతో పనులు చేస్తున్నారు.
వీరితో పాటు గ్రామానికి ఒకటి చొప్పున చెత్తను తీసుకెళ్లేందుకు వాహనాలు కేటాయించారు. ఈ వాహనాలు నడిపేందు కు రాష్ర్ట వ్యాప్తంగా 12 వేల మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వాహనాలకు ప్రతిరోజు డీజిల్ పోసేందుకు చాలా ఖర్చు అవుతుంది. ఈ డ్రైవర్లకు నెలకు రూ.9,500ల చొప్పున వేతనాలు ఖరారు చేశారు. వీరికి కూడా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 5 నెలలుగా వేతనాలివ్వలేదు. దీంతో వీళ్లు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజు గ్రామాల్లోని పలు ప్రాంతాల్లో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం వీరి బాధ్యత. వీరికి నెలకు రూ.18 వేల వేతనాన్ని ఖరారు చేశారు. వీరికి కూడా ప్రతి నెలా వేతనం ఇవ్వడంలేదు. రెండు, మూడు ఇలా ఎలా పడితే అలా వేతనాలిస్తున్నారు. దీంతో కార్మికులు వేతనాలు రాకపోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టంగా మారింది. వీరికి దాదాపు 4 నెలలుగా వేతనాలు అందలేదు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టకి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ క్రమంలో కార్మికులకు వేతనాలివ్వాలని కోరుతూ పలుమార్లు ప్రజా సంఘాల నాయకులు కార్యాలయాల ఎదుట నిరసనలు చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నారు.
తప్పని రాజకీయ వేధింపులు
గ్రామాలు, మండలాలు, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్, పారిశుధ్య, చెత్త సేకరణ డ్రైవర్లకు రాజకీయ నాయకులు, అధికారుల నుంచి వేధింపులు తప్పడంలేదు. గ్రామాల్లో సర్పంచులు చెప్పినట్లు వినకుంటే కార్మికులను తొలగించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత చాలా మంది కార్మిలను తొలగించారు. కొన్ని జిల్లాల్లో రాజకీయ వేధింపులు, అధికారుల ఒత్తిడి కారణంగా కార్మికులే స్వయంగా మానేశారు. వారు దాదాపు 10 నెలలు పని చేసినా వారికి ఎలాంటి వేతనాలివ్వలేదు. చాలా మంది కార్మికులు రాజకీయ నేతలను ఎదురించలేక, అధికారులను నిలదీయలేక స్వచ్ఛందంగా మానేసి కూలీ పనులకెళ్తున్నారు. చెత్తసేకరణ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రామ పంచాయతీలకు నిధులు లేవంటూ వాహనాలకు డీజిల్ కూడా పోయించడంలేదు. చాలా ప్రాంతాల్లో వాహనాల్లో కాకుండా సైకిళ్ల ద్వారానే చెత్త సేకరణ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి రూ.5 నుంచి రూ.6 లక్సల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. జిల్లాస్థాయి అధికారులు స్వచ్ఛ భారత్ కార్మికులకు 4 నెలలకు సంబంధించిన వేతనాలు అందజేయాలని ఆదేశాలిచ్చారు. అయితే గ్రామ సర్పంచులు, మండల స్థాయి అధికారులు కుమ్మక్కై కేవలం 2 నెలలకు సంబంధించిన వేతనాలు మాత్రమే విడుదల చేయించారు. మిగతా నిధులను వివిధ పనుల పేరుతో డ్రా చేసుకుని పంచుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాలకు చెందని కార్మికులు తమకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ రాష్ర్ట వ్యాప్త ఆందోళనకు సిద్ధమౌతున్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- అంజిబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, కర్నూలు
రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్, పారిశుధ్య కార్మికులు, చెత్తసేకరణ వాహన డ్రైవర్లకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలు సకాలంలో చెల్లించాలి. లేకుంటే ఈ కార్మిక కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది కార్మికులు వేతనాలు రాకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేసి మరీ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అందులో ప్రధానంగా చెత్త సేకరణ వాహన డ్రైవర్లకు ప్రస్తుతం ఇస్తున్న రూ.9,500లు ఏ మూలకూ సరిపోవడంలేదు. అందువల్ల వారికి నెలకు రూ.18 వేల కనీస వేతనమివ్వాలి. అంతిమంగా ఆయా రంగాలకు చెందిన కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము.