Kurnool: సీఎం జగన్ సభకు ఉపాధి కూలీలు
రాష్ట్ర ముఖ్యమంత్రి పత్తికొండ పర్యటన సందర్భంగా జన సమీకరణలో భాగంగా ఉపాధి కూలీలను సీఎం బహిరంగ సభకు తరలించారు...
దిశ, కర్నూలు ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి పత్తికొండ పర్యటన సందర్భంగా జన సమీకరణలో భాగంగా ఉపాధి కూలీలను సీఎం బహిరంగ సభకు తరలించారు. దీంతో ఆదోని డివిజన్లోని మంత్రాలయం, ఆదోని, కోసిగి, పెద్దకడుమూరు మండలాలకు చెందిన ఉపాధి కూలీలను అధికారులు బలవంతంగా సభకు తరలించారు. 31న ఆదోనిలో 11,056, కోసిగిలో 6,642, కౌతాళంలో 5,527, మంత్రాలయం 5,540, పెద్దకడుమూరు మండలంలో 6014 మంది చొప్పున కూలీలుగా హాజరు నమోదైంది. అయితే రెండ్రోజులుగా కూలీలకు ఎలాంటి పని ఉండదని, ప్రతి ఒక్కరూ సీఎం సభకు హాజరురావాలని, రాని వారికి మస్టర్లు వేయమని ఏకంగా జిల్లా ఉన్నతాధికారులే క్షేత్రస్థాయి అధికారులకు హుకూం జారీ చేయడం చూస్తుంటే ఏ స్థాయిలో కూలీలను భయపెట్టారో అర్థమౌతోంది.
ఒకవైపు జిల్లా అధికారులే మండలాలకు టార్గెట్లు ఇచ్చి వాటిని అధిగమించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నోటీసులు జారీ చేసే అధికారులు అధికార పార్టీ నేతలు చేయాల్సిన జన సమీకరణను వారి భుజాలపై వేసుకున్నారు. అందుకే కూలీలకు పని కల్పించకుండా సభకు తరలించారు. ఇలా బలవంతంగా సభకు తరలించడం పట్ల అధికారుల తీరుపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు. అధికారుల కారణంగా ఆదోని డివిజన్‌లో గురువారం జీరో మ్యాండేజ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.