అక్రమాలకు ఐదేళ్లు.. ఐటీడీఏలో పీఓ అవినీతి బాగోతం?

అడవి గడప దాటని ఆదివాసుల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పీఓగా బాధ్యతలు చేపట్టిన అక్రమార్కుడి అవినీతి, అక్రమాలకు ఐదేళ్లు అయింది.

Update: 2024-07-21 02:45 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: అడవి గడప దాటని ఆదివాసుల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో పీఓగా బాధ్యతలు చేపట్టిన అక్రమార్కుడి అవినీతి, అక్రమాలకు ఐదేళ్లు అయింది. వైసీపీకి చెందిన ఆ అధికారి అక్రమార్గంలో బాధ్యతలు చేపట్టి వక్ర బుద్ధిని చూపించారు. చెంచుల ఆర్థికాభివృద్ధిని విస్మరించి వైసీపీ నేతల సేవలో తరించారు. అందుకు వైసీపీ పెద్దలు స్వామి భక్తిని మెచ్చి ఐదేళ్ల డిప్యూటేషన్ ను కానుకగా ఇచ్చారు. చెంచుల సంక్షేమానికి ఫుల్ స్టాప్ పెట్టి అక్రమార్జనే ధ్యేయంగా పని చేశారు. చెంచుల బాగోగుల కన్నా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికల ముందు అధికారినని మరచి వైసీపీ కార్యకర్త అవతారమెత్తారు. కోట్ల చెంచుల నిధులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారానికి వినియోగించారన్న ఆరోపణలు లేకపోలేదు.

పని భారం తప్పించుకునేందుకు..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చెంచుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇది మొదట 1975-76 కాలంలో హైదరాబాద్ లో ప్రధాన కార్యాలయం ఉండేది. 1988 కాలంలో ఐటీడీఏను హైదరాబాద్ నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు తరలించారు. వీటి పరిధిలో ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని చెంచుల కోసం శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంట లో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 27,857 షెడ్యూల్డ్ తెగలున్నాయి. 1975లో చెంచు తెగ పీవీటీజీగా గుర్తింపు పొందింది. ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల పరిధిలో 165 మండలాలకు గానూ 27 మండలాలు, 96 గ్రామాలు, 186 చెంచు గూడేలున్నాయి. అందులో 6,912 కుటుంబాలు, 27,857 మంది చెంచు జనాభా ఉంది.

ఈ మూడు జిల్లాల పరిధిలో మైదాన ప్రాంత ఎస్టీలు 4,81,065 మంది, చెంచులు 27,857 మంది ఉన్నారు. వీరందరి ఆర్థికాభివృద్ధి కోసం ఐటీడీఏకు ఒక పీఓను నియమించారు. 2019 వరకు పీఓలుగా పని చేసిన వారంతా కాస్తో కూస్తో చెంచుల కోసం పని చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీఓగా బాధ్యతలు చేపట్టిన తిరుపతి వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న బీ.రవీంద్రా రెడ్డి పని భారం తప్పించుకునేందుకు పావులు కదిపి పీఓ పోస్టు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల ముందు వరకు చెంచుల ఆర్థికాభివృద్ధికి పాటు పడకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డికి పీఓ సోదరుడు స్నేహితుడు కావడం, పీఓ కూడా వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయన ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

అక్రమాల కోసమే ఐటీడీఏకు?

అనంతపురం జిల్లాకు చెందిన ప్రస్తుత ఐటీడీఏ పీఓ బీ.రవీంద్రా రెడ్డి తిరుపతి వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో స్టాటిస్టిక్స్, మ్యాథమేటిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఆయనకున్న పరిచయాలతో దాదాపు రూ.20 లక్షల మేర ఖర్చు చేసి మరీ ఐటీడీఏ పీఓగా పోస్టు తెచ్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఏడాది పాటు డిప్యూటేషన్ పై పీఓగా వచ్చారు. కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి సోదరుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డికి పీఓ సోదరుడు స్నేహితుడు కావడం పీఓకు కలిసొచ్చింది. వచ్చిన ఏడాదిలో వైసీపీ నేతల పట్ల స్వామి భక్తిని చాటుకున్నారు. దీంతో ఆయన భక్తి భావానికి ప్రతిఫలంగా నేతలు మరో నాలుగేళ్లు పని చేసేలా కానుక ఇచ్చారు.

వారి రుణం తీర్చుకునేందుకు పీఓ చేసిన అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదు. చెంచుల అభివృద్ధి కోసం వచ్చే నిధులు దారి మళ్లించడం, ఆ నిధులతో తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడన్న ఆరోపణలు న్నాయి. వ్యవసాయ కళాశాలలో పనిభారం తప్పించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. అందుకోసం చేయని అవినీతి, అక్రమమంటూ ఏదీ లేదని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఐటీడీఏకు చెందిన కోట్ల నిధులు దోచేసి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి ఎన్నికల ప్రచారానికి మళ్లించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. అలాగే పుట్టపర్తి వైసీపీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీదర్ రెడ్డి గెలుపు కోసం బుక్కపట్నంలో ప్రచారం కూడా చేసినట్లు సమాచారం.

టీడీపీ రాకతో తప్పుకునే యత్నం

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తన బండారం బయట పడుతుందని భావించి మాతృ సంస్థకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న గిరిజన సంక్షేమ శాఖ రాష్ర్ట స్థాయి ప్రాజెక్టు కమిటీ సభ్యులు డి.అంకరావు, కె.మూగెన్న, చెంచులక్ష్మి సొసైటీ అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు బల్మూరి పరమేశ్వర్ తదితరులు పీఓపై ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. 2019లో ఐటీడీఏ ప్రత్యేక డీఎస్సీ ద్వారా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన చెంచులకు కాకుండా ఇతరులకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి లక్షలు దన్నకున్నారని, ఉపాధిలో భారీ అక్రమాలు చేశారని, దోర్నాల మండలంలో రైతులకు నాసీరకం మోటార్లు ఇవ్వడంతో పాటు అర్హత లేకున్నా వైసీపీ నేతల అండదండలతో పీఓగా పోస్టు తెచ్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలాంటి అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగంతో పాటు వైసీపీ నేతల కోసం ప్రచారం చేసిన పీఓ బీ.రవీంద్రా రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేసి అర్హులకు ఉపాధ్యాయ పోస్టులు ఇప్పించి చెంచులకు న్యాయం చేయాలని కోరారు. దీంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఓ బీ.రవీంద్రా రెడ్డిని రాష్ర్ట ఉన్నతాధికారులు రిలీవ్ చేయకుండా ఆపినట్లు సమాచారం. ఆయనపై అధికారులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నేరం రుజువైతే జైలుకెళ్లడం ఖాయమని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై పీఓను వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

Tags:    

Similar News