Ap News: మల్లన్న కోసం కాలినడకన అటవీ ప్రాంతంలో పయనం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని భక్తులు మల్లన్న చెంతకు కాలినడకన పయనమయ్యారు. కర్నాటక భక్తులే కాక ఏపీ భక్తులు కూడా మల్లన్న దర్శనానికి భారీగా తరలివెళ్తున్నారు..

Update: 2023-02-12 13:15 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని భక్తులు మల్లన్న చెంతకు కాలినడకన పయనమయ్యారు. కర్నాటక భక్తులే కాక ఏపీ భక్తులు కూడా మల్లన్న దర్శనానికి భారీగా తరలివెళ్తున్నారు. కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ఆత్మకూరు మీదుగా కాలినడకన భక్తులు శ్రీశైలం చేరుకుంటున్నారు. శ్రీశైలం మహా క్షేత్రంలో రెండ్రోజులగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో వేల సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వెళ్తు్న్నారు. అలాగే మరికొంత మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వెంకటాపురం గ్రామం చేరుకుని అక్కడి నుంచి అటవీ మార్గం మీదుగా శ్రీశైలం వెళ్తున్నారు. వీరంతా వెంకటాపురం గ్రామం నుంచి నల్లమల అభయారణ్య ప్రాంతంలో నాగలూటి చెంచు గూడేం దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన వీరభద్ర స్వామి ఆలయం చేరుకుంటారు. అక్కడ సేద తీరి మెట్ల మార్గం ద్వారా పెచ్చెర్వు చేరుకుంటారు. అక్కడి నుంచి భీమునికొలను తదితర ప్రాంతాల మీదుగా భక్తులు శ్రీశైలం చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.


అటవీ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు

శివస్వాములు, యాత్రికులు, పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ఎక్కడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షణ చేసేందుకు సిబ్బందిని నియమించింది. నాగలూటి గూడేం దాటగానే అటవీ ప్రాంతంలోకి వెళ్లే ప్రారంభ దశలోనే అటవీ సిబ్బంది పర్యాటకుల నుంచి నిషేధిత వస్తువులైన బీడీలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, ఇతర వస్తువులను తీసేసి వారి బ్యాగులను పరిశీలించి పంపుతున్నారు. భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైద్య శాఖ కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ప్రధాన ప్రాంతాల్లో వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అక్కడక్కడా వివిధ స్వచ్ఛంద సంస్థలు, భక్తులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతిమంగా రోజురోజుకూ పెరుగుతోన్న భక్తుల రద్దీలో నల్లమల శివనామ స్మరణతో మార్మోగింది.

Tags:    

Similar News