తిరుమల లడ్డూ వివాదం.. రేపటి నుంచి దీక్షకు సిద్ధమైన పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవారిని క్షమించమంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టనున్నారు. ...

Update: 2024-09-21 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారం (Tirumala Laddu Issue) దేశవ్యాప్తంగా దుమారం రేగింది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయింది. దీంతో తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ  భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Janasena Chief, Deputy Cm Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు.తిరుమల శ్రీవారిని క్షమించమంటూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టనున్నారు.ఈ మేరకు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

‘‘అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం.’’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. ‘దేవదేవా... నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమ’ని వేడుకుంటాను.’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.


Similar News