పండా.. పుండా ! షా, నడ్డాతో చంద్రబాబు చర్చలు ఇంకా కొలిక్కి రాలేదా ?

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సహజం. చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ ఛీఫ్​ నడ్డాతో భేటీ అయ్యారు.

Update: 2023-06-05 03:20 GMT

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో సహజం. చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ ఛీఫ్​ నడ్డాతో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకే చంద్రబాబు వెళ్లారు. అంటే కచ్చితంగా తెలంగాణ, ఏపీలో పరస్పర సహకారం లేదా పొత్తుల గురించేననేది నిర్వివాదాంశం. ఇంతకీ చర్చల సారాంశం ఏంటి ? పొత్తుకు ప్రాతిపదిక కుదిరిందా.. లేదా ? ఇరు పార్టీల మధ్య సానుకూలత ఏర్పడితే మోడీని చంద్రబాబు కలిసే అవకాశం ఉండేది. ఉదయాన్నే బాబు తిరుగు పయనమయ్యారంటే చర్చల్లో ఏం జరిగి ఉంటుంది ? చర్చలు ఓ కొలిక్కి రాలేదనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు పార్టీలకు ఆమోదయోగ్యమై ఉంటే చంద్రబాబు మీడియాకు చెబుతారు కదా ! ఆయన మౌనంగా వెళ్లిపోయారంటే ఇంకా సందిగ్దత కొనసాగుతున్నట్లేనని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: ఇప్పుడున్న ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే. కార్యకర్త నుంచి నాయకుల దాకా వాళ్ల పరిధిలో జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంటారు. అధ్యయనం చేస్తుంటారు. అసలు టీడీపీ ఆవిర్భావమే ప్రగతిశీల శక్తుల కలయికతో జరిగింది. అందువల్ల పార్టీ అధినేత ఏ పాట పాడితే ఆ పల్లవి అందుకోవడానికి ససేమిరా అంటారు. వెంటనే భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తారు. ప్రస్తుతం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్లారంటే కొందరు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ధృత రాష్ట్ర కౌగిలిలోకి వెళ్తున్నారేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రజలకు ఏం సమాధానం చెబుతారని.. ఓట్లు ఎలా అడుగుతారని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీతో దోస్తీతో నష్టమేనా..

కేవలం తెలంగాణలో మద్దతునిచ్చి ఏపీలో తటస్థంగా ఉండేట్లు చంద్రబాబు మాట్లాడి ఉండొచ్చని టీడీపీలో ఓ సెక్షన్​ చెబుతోంది. ఇక్కడ వైసీపీకి వెనుక నుంచి మద్దతునివ్వకుండా ఉంటే చాలని చంద్రబాబు బీజేపీ పెద్దలను అడిగి ఉండొచ్చంటున్నారు. ఎన్నికల కదనరంగంలో కేంద్ర సర్కారు విధి విధానాలు, రాష్ట్రంలో అమలవుతున్న తీరు గురించి ప్రస్తావించకుండా ప్రజలను మెప్పించలేరు. వైసీపీని తెరచాటు నుంచి నడిపిస్తోంది బీజేపీ అనేది సగటు ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిస్తే వైసీపీ ఆ ముద్రను తొలగించుకోవడం తేలికవుతుంది. గెలిచిన తర్వాత యథావిధిగా కలిసి పనిచేద్దామంటూ అవసరమైతే ఎన్నికల ప్రచారంలో వైసీపీ బీజేపీని టార్గెట్​ చేస్తుంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కేంద్రంపైకి నెట్టేసి జగన్​ మళ్లీ గద్దెనెక్కే అవకాశం లేకపోలేదు. బీజేపీతో దోస్తీ వల్ల టీడీపీకి కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొన్ని సర్వేలు కూడా దీన్నే నొక్కి వక్కాణిస్తున్నాయి.

చంద్రబాబుపై కార్యకర్తల నమ్మకం..

అనేక కోణాల్లో ఆలోచనలు చేసిన తర్వాతనే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని కొందరు తమ్ముళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. పార్టీకి నష్టం కలిగే రీతిలో నిర్ణయాలు తీసుకోరనే నమ్మకంతో ఉన్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు వదలరనే భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అమిత్​ షా, నడ్డాతో భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి.. వాటిపై ఇంకా ఇరు పార్టీల నుంచి సానుకూలత లేనట్లే కనిపిస్తోంది. ఒకవేళ ప్రాథమికంగా ఓ అంగీకారానికి వచ్చినా మోడీతో చంద్రబాబు కరచాలనం ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే ఢిల్లీ నుంచి తిరుగు పయనమయ్యారంటే చర్చలు ఓ కొలిక్కి రాలేదని భావించవచ్చని అంచనా వేస్తున్నారు. 8న అమిత్​ షా విశాఖ పర్యటన నాటికి పొత్తులపై సంకేతాలు వెలువడవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News