సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పదు: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదిలేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా, జగన్ కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులు పెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు అని సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవద్దని అన్నారు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు హైకోర్టు జడ్జిలపైనా.. న్యాయవాదులు, న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. స్కిల్ స్కాం కేసులో మహిళా జడ్జిపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారని వాటిపైనా దృష్టి సారించినట్లు తెలిపారు. విజయవాడలో బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని.. ఇకపై అలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై ఖచ్చితంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం అధికార పార్టీ నాయకులే కాదని ప్రతిపక్ష నాయకుల మీద సోషల్ మీడియాపైనా పోస్టులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఎవరిపైనా అయినా అనుచిత పోస్టులు పెడితే చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. ప్రజలు ముఖ్యంగా యువత సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని... దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు.