జబ్బు నయం అయ్యే వరకు తోడుంటాం: సీఎం వైఎస్ జగన్
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం.
దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి అందరికీ వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి అరవై లక్షల కుటుంబాలను వైద్య బృందాలు కలిసి ఏడు రకాల వైద్య పరీక్షలు ఇంటి వద్దనే చేస్తారని తెలిపారు. గ్రామాల్లో సురక్ష క్యాంపులను నిర్వహించి మందులు సైతం పంపిణీ చేయనున్నారని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
ప్రతీ ఇంటిని జల్లెడ పడతాం
గ్రామస్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగస్వాములేనని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 10,032 సచివాలయాల పరిధిలో విలేజ్ క్లినిక్స్ అందుబాటులోకి తెచ్చామని.. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నయం అయ్యే వరకు తోడుంటాం అని సీఎం జగన్ తెలిపారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అంతేకాదు ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే ఇంకో డాక్టర్ అంబులెన్స్‌లో గ్రామాల్లోకి వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.