ఈ రాజకీయాలకు నేను సరిపోను..అందుకే తప్పుకుంటున్నా: ఎమ్మెల్యే ఆర్కే

ఈ రాజకీయాలకు నేను సరిపోను. రాజకీయాల నుండి తప్పుకుంటున్నా’ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

Update: 2023-12-11 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఈ రాజకీయాలకు నేను సరిపోను. రాజకీయాల నుండి తప్పుకుంటున్నా’ అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పదవికి, పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి సోమవారం రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ‘11-12-2023 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని నా స్థానమునకు ఇందుమూలముగా రాజీనామా ఇచ్చుచున్నాను’ అంటూ రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా అనంతరం పార్టీ నాయకులు, అనుచరులు, నేతల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయాలకు తాను సరిపోనంటూ పెదవి విరిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇమడలేక తప్పుకుంటున్నట్లు వాపోయారు. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని ప్రాంతంలో కీలకమైన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

ఇమడలేకనేనా?

2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ బరిలోకి దిగారు.అయితే నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసి పోటీ చేయడంతో గెలుపు తథ్యమనే అంతా భావించారు.కానీ ఎవరూ ఊహించని రీతిలో లోకేశ్ ఓటమి పాలయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక కేసులు వేస్తూ టీడీపీని ముప్పు తిప్పలు పెడుతున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే గంజి చిరంజీవి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసహనంతో ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు గంజి చిరంజీవి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఆదివారం నియోజకవర్గంలో ఏకంగా పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు గంజి చిరంజీవి. మరోవైపు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను అందజేశారు. అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాపట్ల వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Tags:    

Similar News