పెద్దాపురంలో హైటెన్షన్ : లై డిటెక్టర్ పరీక్షలకు TDP,YCP సై

కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో ఉద్రిక్తత నెలకొంది.

Update: 2023-07-31 07:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో పెద్దాపురం నియోజకవర్గం అట్టుడుకుతుంది. అటు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజ్ప ఇటు వైసీపీ ఇన్‌చార్జి దొరబాబులు దేనికైనా సై అంటే సై అంటున్నారు. ఎమ్మెల్యే చినరాజప్పపై దొరబాబు చేసిన ఆరోపణలపై లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం అంటే నేను సిద్ధం అంటూ ఇరువురు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్టర్ టెస్టు, బహిరంగ చర్చ కోసం మున్సిపల్ సెంటర్‌‌కు వెళ్లేందుకు బయలుదేరారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు మున్సిపల్ సెంటర్ వైపు వెళ్లేందుకు వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం వద్దే అదుపు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇరువర్గాల ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు హెచ్చరించారు. ఇరువర్గాలు దేనికైనా సై అంటే సై అంటున్న తరుణంలో పెద్దాపురంలో ఎప్పుడూ ఏం జరుగుతుందోననే హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

చినరాజప్ప వర్సెస్ దొరబాబు

ఇకపోతే పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దొరబాబుల మధ్య కొంతకాలంగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో దాడికి దిగుతున్నారు. టీడీపీ హయాంలోనే పెద్దాపురం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చినరాజప్ప అంటుంటే కాదు తమ ప్రభుత్వంలోనే అభివృద్ది జరిగిందంటూ దొరబాబు చెప్పుకొస్తున్నారు. పెద్దాపురం నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన దొరబాబుకు లేదని..అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటున్నారని చినరాజప్ప ఆరోపించారు. అంతేకాదు అక్రమ మైనింగ్, మట్టి మాఫియాకు, గ్రావెల్ తవ్వకాలకు దొరబాబు అండగా నిలుస్తున్నారంటూ బాంబు పేల్చారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా దొరబాబు నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపణలపై వైసీపీ ఇన్‌చార్జి దొరబాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరి ప్రభుత్వంలో అవినీతి జరిగిందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్‌ వద్ద లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. ఆ లైడిటెక్టర్ పరీక్షలో తన నిజాయితీ రుజువు కాకపోతే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని దొరబాబు స్పష్టం చేశారు. మరోవైపు లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్దమని చినరాజప్ప ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురు మున్సిపల్ సెంటర్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. 

ఇవి కూడా చదవండి ఏయూ విద్యార్థులతో ఇంటరాక్ట్: రేపు విశాఖకు సీఎం వైఎస్ జగన్

Tags:    

Similar News