AP: పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ నీటిమట్టంతో ఎటువంటి ప్రమాదం లేదు. నీటి మట్టం పెరిగితే పట్టిసీమ వద్ద కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.

Update: 2024-06-30 13:21 GMT

దిశ,ఏలూరు: పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ నీటిమట్టంతో ఎటువంటి ప్రమాదం లేదు. నీటి మట్టం పెరిగితే పట్టిసీమ వద్ద కూడా నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. గోదావరి నీటిమట్టం 14 మీటర్లు దాటితే పోలవరం కుడి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే వీలు కలుగుతుంది. పట్టిసీమ నిర్మాణ సమయంలో 14 మీటర్ల నీటిమట్టం లిఫ్ట్ చేశాక కుడి ఎడమ కాల్వకు నీరివ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ నుండి 14 మీటర్ల కంటే తక్కువ స్థాయిలో నీటిమట్టం ఉన్నా తోడేయడంతో రైతులు సాగు నీటికి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 14 మీటర్లు దాటాక పట్టిసీమ లిఫ్ట్ నుంచి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం గోదావరి నీటి మట్టం స్పిల్ వే ఎగువన 24.380 మీటర్లు, దిగువన 15.800 మీటర్లు నమోదైంది. శనివారం తో పోలిస్తే 2 పాయింట్లు పెరిగింది. మరోవైపు ఎగువ కాపర్ డ్యాం వద్ద 24.480 మీటర్ల నీటి మట్టం నమోదయింది. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 14.500నీటి మట్టం నమోదయింది. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. స్పిల్ వే వద్ద 54 మీటర్లు వచ్చే దాకా కంగారు పడనవసరం లేదని స్పష్టం చేశారు . గత సోమవారం జలవనరుల శాఖ అధికారులు సీలేరు నుంచి రెండు వేల క్యూసెక్కులు విడుదల చేసిన జలాలు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పొంగిన కొండవాగుల జలాలతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన గోదావరి నీటి మట్టం పెరిగింది.

నిన్న ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 22.950 మీటర్లు, స్పిల్వే దిగువన 15,300 మీటర్లు, కాఫర్‌ డ్యాంకు ఎగువన 23.000 మీటర్లు, కాఫర్‌ డ్యాంకు దిగువన 13.920 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఈఈ పి.వెంకటరమణ తెలిపారు. మరోవైపు పాపికొండల విహార యాత్ర బోట్ల రాకపోకలు పునః ప్రారంభించామని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఆర్‌.గంగబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు పాపికొండల పర్యటన బోట్ల రాకపోకలు పునరుద్ధరించామన్నారు. పాపికొండల విహార యాత్రకు ఆన్‌లైన్‌ టికెట్లు బుక్‌ చేసుకొను పర్యాటకులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత నంబర్లకు కాల్‌ చేసి నిర్ధారించుకుని టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.


Similar News