వైసీపీపై తిరుగుబాటు మొద‌లైంది: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పేరు చెబితే చాలు ట‌క్కున గుర్తొచ్చే పేరు వ‌ర్మ‌.

Update: 2023-05-07 12:24 GMT

దిశ, కాకినాడ‌: పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పేరు చెబితే చాలు ట‌క్కున గుర్తొచ్చే పేరు వ‌ర్మ‌. టీడీపీ పేరే ఆయ‌న ఇంటిపేరులా మారిపోయింది. అందుకే ఆయ‌నను టీడీపీ వ‌ర్మ అంటారు. కాకినాడ జిల్లాలో అత్య‌ధిక కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు ఉన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఓ క్ష‌త్రియుడు పాగా వేశారంటే అది ఆయ‌న సేవా గుణ‌మ‌నే చెప్పాలి. 2014లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఏకంగా 50 వేల ఓట్లతో గెలుపు సాధించి రికార్డు సృష్టించారు. రాజ‌కీయం అంటే కుల‌మే కాద‌ని, సేవ‌కు తార్కాణ‌మ‌ని నిరూపించారు వ‌ర్మ‌. ప్ర‌జ‌ల్లో నిత్యం ఉంటూ ప్ర‌జల‌కు మేలు చేయ‌డంలో ఆయ‌న శైలే వేరు. ముక్కు సూటిత‌నం, ప‌ట్టుద‌ల క‌ల‌గ‌లిపి వ‌ర్మ‌ను ఉహించ‌ని స్థాయిలో ఓ ఉన్న‌త నేత‌గా నిల‌బెట్టారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.

నిత్యం జ‌నంలో ఉండ‌టం ఆయ‌న నైజం. అయిన‌ప్ప‌ట‌కీ ఏక చ‌త్రాధిప‌త్యం అనే అప‌వాధ‌ను మూట‌గ‌ట్టుకున్న సంద‌ర్బాలు లేక‌పోలేదు. రాజు కంటే మొండివాడు గొప్ప అన్న‌ట్టుగా సాగిన ప్ర‌యాణంలో వ‌ర్మ ఓట‌మికి గుర‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌తో ఉన్న వారే ఆయ‌న‌పై తిరుగుబాటు చేశారు. వ‌ర్మ పై నిరంకుశుడ‌న్న ఆరోప‌ణ‌లు ఆయ‌న‌ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత జ‌రిగినా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం ఏనాడు వీడ‌లేదు. ఇదిలా ఉంటే 2024 ఎన్నిక‌ల‌కు ఆయ‌న సిద్ధంగా ఉన్నారా..ఆయ‌న బ‌ల‌మేంటి..బ‌ల‌గ‌మేంటి అన్న దానిపై దిశప్ర‌తినిధి క‌లిసిన‌ప్పుడు, వ‌ర్మ త‌న మ‌నోగ‌తాన్ని పంచుకున్నారు.

జ‌నం భ‌యంతో బ‌తుకుతున్నారు

వైసీపీ మోసాల‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు జ‌నం సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ, జ‌నం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడేందుకు భ‌యంతో ఉన్నార‌న్నారు వ‌ర్మ‌. ఒక ప‌క్క గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్న ఎమ్మెల్యేల‌కు అడుగ‌డుగునా చుక్కెదర‌వుతోంద‌ని చెప్పారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేను అడ్డుకుంటున్నారు. త్వ‌ర‌లో మ‌రింత‌ తిరుగుబాటు వ‌స్తుంది. ప‌థ‌కాల పేరుతో అంతా మోసం చేస్తున్నారని వ‌ర్మ ఆరోపించారు. జ‌గ‌న్ ను నమ్మ‌డం అనే స్లోగ‌న్ వింటుంటే అంద‌రూ న‌వ్వుకుంటున్నార‌ని, జ‌గ‌న్ ఏం చేశార‌ని ఓట్లేయ్యాలని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిరుద్యోగుల‌ను నిలువునా మోసం చేసిన ఘ‌నుడు జ‌గ‌న్‌. పిఠాపురం నియోజ‌క‌వర్గాన్నే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తే ఏలేరు రైతుల‌ను నిలువునా ముంచిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుందన్నారు వ‌ర్మ‌.

గ‌తంలో ఏలేరు ఆధునికీక‌ర‌ణ‌కు నిధులు వెచ్చించాం. కానీ అందులో ఒక్క శాతం ప‌నుల‌ను కూడా వైసీపీ చేయ‌లేక‌పోయింది. తాండ‌వ నీరు అమ్ముకున్న ఘ‌న‌త పిఠాపురం ఎమ్మెల్యే దొర‌బాబు, కాకినాడ ఎంపీ గీత‌కు ద‌క్కుతుంద‌ని విమర్శించిన వ‌ర్మ‌, రాజ‌ధాని రైతుల‌కు ఈ ప్ర‌భుత్వం న‌ర‌కం చూపిస్తుంద‌న్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే రైతులు, వ్యాపారులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఇలా ప్ర‌తీ రంగాన్ని వేధించిన ఘ‌న‌త ఒక్క వైసీపీకే ద‌క్కుతుంద‌ని వ‌ర్మ తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఎక్కువ స్కామ్‌లు చేసార‌ని వైసీపీకీ ఓట్లు వేయాలా..?

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొర‌బాబు ఏం చేశార‌ని ప్ర‌జ‌ల‌కు ఓట్లు వేస్తారో ఆయ‌నే చెప్పాల‌న్నారు. క‌నీసం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాప‌న పోలేద‌న్నారు. సొంత వ్య‌క్తుల అక్ర‌మాల‌కు వంత పాడిన ఎమ్మెల్యే దొర‌బాబుకి రాబోయే ఎన్నిక‌లు ఓ గుణ‌పాఠం అవుతాయ‌ని వ‌ర్మ జోస్యం చెప్పారు. మ‌ట్టి, గ్రావెల్‌, ఇసుక మాఫియాల‌తో ఇక్క‌డ వైసీపీ నేత‌లు చెల‌రేగిపోయారు. పిఠాపురం టిడీపీకి వైసీపీ పోటీయే కాద‌ని వ‌ర్మ అన్నారు. ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నారన్న విష‌యాన్ని ఎమ్మెల్యే దొర‌బాబు గుర్తుంచుకుంటే బాగుంటుంద‌న్నారు.

సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లే దొర‌బాబును బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నార‌ని వ‌ర్మ గుర్తు చేశారు. ఎమ్మెల్యే దొర‌బాబు ఇళ్ల స్థ‌లాలు కొనుగోళ్ల విష‌యంలో కోట్లు కోల్ల గొట్టారు. గొల్ల‌ప్రోలు మండ‌లం దుర్గాడ గ్రామంలో ఇళ్ల ప‌ట్టాల విష‌యంలో వైసీపీ నేత‌లు వ‌సూళ్లు నిజం కాదా అని వ‌ర్మ ప్ర‌శ్నించారు. జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌ట్టాల్లో భాగంగా 62 ఎక‌రాలు కొనుగోలు చేశారు. ఇందులో 4 వేల మందికి ప‌ట్టాలు ఇచ్చారు. ఈరోజుకి అందులో ఒక్క‌రికీ స్థ‌లం చూపించ‌లేదని వ‌ర్మ మండిప‌డ్డారు. మ‌రోప‌క్క టిడీపీ హ‌యాంలో ఇచ్చిన టిడ్కో గృహాల‌కు దిక్కు మొక్కు లేదు. కేవ‌లం వైసీపీలో నిరంకుశ పాల‌న సాగుతోంద‌ని వ‌ర్మ విమ‌ర్శించారు.

కాపుల‌కు మేలు ఏం చేశారో చెప్పాలి

కాపులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల‌తో వ‌ర్మ రాజ‌కీయం చేస్తున్నారంటున్న దొర‌బాబు అదే వ‌ర్గాల‌కు ఏం మేలు చేశారో చెబితే బాగుంటుంద‌ని వ‌ర్మ హిత‌వు పలికారు. అన్ని సామాజిక వ‌ర్గాలు బాగుండాల‌నేది త‌మ అభిమ‌త‌మ‌ని గుర్తుంచుకోవాల‌న్నారు. అందుకే తాను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు ప్ర‌తీ సామాజిక వ‌ర్గానికి స్థ‌లం కేటాయించామ‌ని, కాని వైసీపీ అధికారం చేప‌ట్టాక‌ అదే స్థ‌లాల‌ను ఎమ్మెల్యే త‌న అనుచ‌రుల ద్వారా అమ్మ‌కానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. టీడీపీ హ‌యాంలో కాపుల‌కు మేలు జ‌ర‌గ‌లేద‌ని, అంతా మోస‌మే జ‌రిగింద‌ని చెబుతున్న దొర‌బాబు ఆయ‌న కాపుల‌కు,ఇత‌ర కులాల‌కు ఏం చేశారో చెబితే బాగుంటుంద‌న్నారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని కులాలు త‌న‌కు స‌మాన‌మేన‌ని, తాను అంద‌రి వాడిని కాబ‌ట్టే గ‌తంలో త‌న‌కు విజ‌యం ద‌క్కింద‌న్నారు. కుల రాజ‌కీయాలు చేసే అవ‌స‌రం లేద‌ని, కేవ‌లం ప్ర‌జ‌లు అంద‌రూ బాగుండాల‌నేదే త‌న అభిమ‌త‌మ‌న్న వ‌ర్మ 2024లో త‌న గెలుపు త‌థ్యం అని ధీమా వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News