పదేళ్లయినా పూర్తిగాని ఆ ప్రాజెక్టు.. చంద్రబాబు, జగన్‌పై ఉండవల్లి తీవ్ర ఆగ్రహం

ఏపీ పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

Update: 2024-06-02 10:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం జగన్‌పై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదాగా ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో కొంత పనులు జరిగాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం డయా ఫ్రమ్ వాల్ కొట్టుకు పోయాయని వివాదం తలెత్తింది. పోలవరం గేట్లు కొట్టుకుపోతే ఎలా ఏర్పాటు చేసుకోవాలనే దానిపై ఆలోచించాలి. కానీ చంద్రబాబు, జగన్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎంతసేపు అధికారంలోకి ఎలా రావాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. అసలు పోలవరం సమస్యను ఎలా పరిష్కరించాలనేదానిపై దృష్టి పెట్టలేదు. గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయో తెలుసుకోకుండా విమర్శలు చేసుకుంటూ సమయం అంతా పోగొట్టారు. అందుకే పదేళ్లు పూర్తి అవుతున్నా పోలవరం పనులు ఆగిపోయాయి. కేంద్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా పోలవరం గురించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా రాష్ట్ర నేతలు పోలవరాన్ని పట్టించుకుని ప్రాజెక్టుకు పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. పెట్టుబడులు ఎవరూ రావడం లేదు. ఉన్న కంపెనీలు సైతం తెలంగాణకు వెళ్లిపోయాయి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అవుతున్నా సినీ ఇండస్ట్రీ సైతం ఆంధ్రప్రదేశ్ కోసం ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ పదేళ్లలో చంద్రబాబు, జగన్ కంపెనీలు ఒక్కటైనా ఏపీకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంలేదు.’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News