జగన్ నిర్ణయాలతో విసిగిపోయా.. త్వరలో టీడీపీలో చేరతా..!
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సినీ నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ నాయకులే కాదు, ఆయనను అభిమానించిన సినీ నిర్మాతలు కూడా విసిగిపోతున్నారు. ఇంతకాలం జగన్ను పొగిడిన వారు కూడా ఇప్పుడు ఆయనను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక విశాఖ రాజధాని పేరుతో జగన్ చేసిన హడావుడిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలనలోనూ ఆయన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి ప్రతిపక్ష పార్టీలకు కలిసి వస్తోంది.
కాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సినీ నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని బూటకమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి రాజధాని పేరుతో నాటకమాడారని మండిపడ్డారు. గతంలో సీఎం జగన్ కు తాను సానుభూతి పరుడినని, ఇప్పుడు ఆయన నిర్ణయాలతో విసిగిపోయాయని చెప్పారు. తమ లాంటి వాళ్లను వైసీపీ తన స్వార్థానికి వినియోగించుకుందని ఆరోపించారు. ఎంపీ సత్యనారాయణ విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన చర్చి ఆస్తులను సొంతం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఈ ఆస్తులు అమ్మడానికి, కొనడానికి వీలు లేకపోయినా.. అధికారాన్ని పెట్టుకుని చర్చి భూములను కొట్టేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో తాను టీడీపీ చేరబోతున్నట్లు నట్టి కుమార్ తెలిపారు. చంద్రబాలు ఆలోచనకు పవన్ బలం తోడవుతోందని.. దీంతో జగన్ కు మతి పోయిందని, అందుకే దండయాత్రలు చేయిస్తున్నారని నట్టి కుమార్ పేర్కొన్నారు.