AP News:తమ పై దుష్ప్రచారం చేసి పొట్ట కొట్టొద్దు.. లారీ యాజమానుల నిరసన

సామాజిక మాధ్యమాల్లో తమపై చేస్తున్న దుష్ప్రచారం తగదని అలా చేసి తమ బతుకులు, పొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

Update: 2024-12-04 15:21 GMT

దిశ,కాకినాడ: సామాజిక మాధ్యమాల్లో తమపై చేస్తున్న దుష్ప్రచారం తగదని అలా చేసి తమ బతుకులు, పొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాధ్యమాల్లో తమను ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ సంజయ్ నగర్‌లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, కార్యదర్శి అల్లంరాజు, కోశాధికారి గణేశుల వాసుల ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు.

తమ పిల్లలు పెరిగి అనేక చోట్ల స్థిరపడ్డారని కాకినాడ పోర్టులో లారీ యజమానులు మాఫియాగా తయారయ్యారని చెప్పడం ఏమిటంటూ వారు అడుగుతుండడంతో తమకు బాధగా అనిపించిందన్నారు. ప్రస్తుతం లారీల నిర్వహణ చాలా భారంగా మారిందని ఒక లారీపై సుమారు నాలుగు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారికి వారిని మాఫియా కుటుంబంగా చిత్రీకరించడం తగదన్నారు. 1961 నుండి ఈ అసోసియేషన్ నిర్వహిస్తున్నామని నాటి నుంచి నేటి వరకు పోర్టుకి లారీ యజమానులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చామని వారు చెప్పారు. తమపై చేస్తున్న దుష్ప్రచారంలో ఎటువంటి నిజం లేదని దీనిపై మీరు నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించారు. తమపై మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారం వల్ల చులకన భావం ఏర్పడి మా బతుకు తెరువులు కోల్పోయే అవకాశం ఉందని అందువల్ల దుష్ప్రచారం మానుకోవాలని దాసరి శ్రీనివాస రావు, అల్లం రాజు, గణేశుల వాసులు వేడుకున్నారు.


Similar News