Supreme Court : అక్రమ ఇసుక మైనింగ్ సమాచారమివ్వండి.. ఏపీ సహా ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో : అక్రమ ఇసుక మైనింగ్(illegal sand mining) కార్యకలాపాలను సీరియస్ అంశంగా సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది.
దిశ, నేషనల్ బ్యూరో : అక్రమ ఇసుక మైనింగ్(illegal sand mining) కార్యకలాపాలను సీరియస్ అంశంగా సుప్రీంకోర్టు(Supreme Court) పేర్కొంది. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారాలతో ముడిపడిన సమాచారం, గణాంకాలను తమకు అందించాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఐదు రాష్ట్రాల్లోని నదులు, బీచ్‌లలో సాగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఎం.అలగర్ సామి అనే వ్యక్తి 2018లో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం విచారించే క్రమంలో సుప్రీంకోర్టు బెంచ్ తాజా ఆదేశాలిచ్చింది.
ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతోందని పిటిషనర్ అలగర్ సామి ఆరోపించారు. పర్యావరణ నిబంధనలను పాటించకుండా, సంబంధిత అనుమతులను పొందకుండా ఇసుక మైనింగ్‌కు అధికార వర్గాలు అనుమతులు ఇస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు పిటిషనర్ తరఫున అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఇదే తరహా పిటిషన్ ఏదైనా పెండింగ్ దశలో ఉందా లేదా అనేది తాము ఒకసారి చెక్ చేస్తామని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను వచ్చే సంవత్సరం జనవరి 27తో మొదలయ్యే వారంలో నిర్వహిస్తామని పేర్కొంది.