బలపడుతోన్న తుపాన్.. ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపటికి తుపానుగా మారనుంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Update: 2024-10-22 02:08 GMT

దిశ, వెబ్ డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వెల్లడించారు. అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి.. రేపటికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ తుపానుకు ఐఎండీ (IMD) దానా(Dana) గా నామకరణం చేయనుంది.

శుక్రవారం తెల్లవారుజామున తీవ్రతుపానుగా ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ - సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. గురు, శుక్రవారాల్లో (అక్టోబర్ 24,25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో విస్తారంగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు.

తీవ్ర తుపాను నేపథ్యంలో మత్స్యకారులు ఈ నెల 25వ తేదీ వరకూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. భారీవర్షసూచన ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తుపానుపై సమీక్ష

బంగాళాఖాతంలో బలపడనున్న తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి టీ.వీ సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలో కేంద్ర కార్యదర్శులు, ఎన్డీఎంఏ మెంబర్, డిఫెన్స్, డీజీ ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డీజీ ఐఎండీ అండ్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఏపీ నుంచి రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ముందస్తుగా తీసుకోనున్న చర్యల గురించి వివరించారు. 


Similar News