విజిలెన్స్ దూకుడు.. వల్లభనేని వంశీకి బిగుస్తున్న ఉచ్చు..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది....

Update: 2024-11-27 15:07 GMT

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former Gannavaram MLA Vallabhaneni Vamsi)కి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్(Illegal Mining) జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కోసం తన వద్ద పని చేసే డ్రైవర్లతో పాటు కొంత కూలీల పేరుతో దరఖాస్తులు చేశారు. అనుమతులు పొందిన తర్వాత ఐదేళ్ల పాటు తవ్వకాలు చేపట్టారు. అయితే ఈ తవ్వకాల్లో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. మైనింగ్ కోసం తీసుకున్న అనుమతులు కంటే అదనంగా తవ్వకాలు చేపట్టారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండలు, గుట్టలు, బంజర భూములు, పోలవరం కట్టలను సైతం తవ్వినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కొల్లు రవీంద్ర సైతం ప్రస్తావించారు. దీంతో వల్లభనేని వంశీ చేసిన మైనింగ్‌పై గన్నవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. 

మరోవైపు గన్నవరంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై  విజిలెన్స్ అధికారులు దూకుడు పెంచినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో అక్రమంగా మైనింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చారని, ఇందుకు సంబంధించి ఇప్పటికే రైతులు, దినసరి కూలీల నుంచి వాంగ్మూలం కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వీటి ఆధారంగానే వల్లభనేని వంశీకి త్వరలో నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని కొందరు స్థానిక నాయకులు కూడా చెబుతున్నారు. సీనరేజీ  చెల్లించకుండా దాదాపు రూ. 100 కోట్ల విలువైన మట్టిని తవ్వినట్లు విజిలెన్స్ అధికారులు అంచనా వేశారని,  ఈ మేరకు వల్లభనేని వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరులపై కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News