సీఎం జగన్ కీలక ఆదేశాలు : ఒక్కో జిల్లాకు రూ.2కోట్లు ..ఒక్కో కుటుంబానికి రూ.2500 పరిహారం

ఏపీకి మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు.

Update: 2023-12-04 10:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీకి మిచౌంగ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాను నేపధ్యంలో చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఖరీప్‌ పంటల కాపాడుకోవడం అత్యంత ప్రధానమని తెలిపారు. కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదు అని అధికారులకు తెలిపారు. బాధితులు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. గతంలో మాదిరిగా కాకుండా కుటుంబానికి మరో రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి అని సూచించారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టాన్ని అంచనా వేయాలి అని సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన కదిలింది. ఇప్పటివరకు సుమారు 1 లక్ష టన్నుల ధాన్యం సేకరించింది. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు యంత్రాంగం తెలిపింది.

ఆ 8 జిల్లాల్లో బీ అలర్ట్

మిచౌంగ్ తుపాను ముప్పు నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఈ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హుద్‌ హుద్‌ లాంటి పెద్ద తుఫానులను కూడా మన రాష్ట్రం చూసింది..అటువంటి తుపాన్లును సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మంచి అనుభవం మన అధికారులకు ఉంది అని సీఎం జగన్ తెలిపారు. ‘210 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా..ఈ తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలి. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అప్పుడు గంటకు 110 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెబుతున్నారు. వర్షాలు కూడా కురుస్తాయి. 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి జిల్లాల కలెక్టర్లు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు చేశాం. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. తిరుపతికి రూ.2 కోట్లు, మిగిలిన జిల్లాల్లో రూ.1 కోటి చొప్పున ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు కూడా మరోరూ.1 కోటి మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులు నియమించాం. వీరంతా కూడా జిల్లాల్లో యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రం నుంచి మీ ఈ జిల్లాల్లో అందుబాటులో ఉంటారు’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.


రైతులకు అండగా నిలబడండి

‘మిచౌంగ్ తుపాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణనష్టం జరగడానికి వీలులేదు. మనుషులుతో పాటు పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు. ఆ మేరకు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.మరోవైపు ఖరీప్‌ పంటల సంరక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి.ఇప్పటికే 97 వేల టన్నులు సేకరించాం. మరో 6.50 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పంట ఇంకా ఎక్కడ కోత కోయలేదో... దాన్ని వాయిదా వేసే విధంగా రైతులకు నచ్చజెప్పాలి. అదే టైంలో కోసిన పంటను ఖచ్చితంగా సేకరించాలి. తేమ ఉన్న ధాన్యం అయినా, రంగు మారిన ధాన్యాన్నైనా ఖచ్చితంగా సేకరించడంపై అధికారులు దృష్టి పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ పీరియడ్‌లో రైతు మనకు అత్యంత ప్రాధాన్యమున్న వ్యక్తి. రైతుకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం సేకరించాలి’ అని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.‘తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి అక్కడ వారిని సురక్షతి ప్రాంతాలకు తరలించాలి. 181 సహాయ పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఈ 8 జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మొత్తంగా 308 సహాయ పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటుకు గుర్తించామని అధికారులు చెప్పారు. ఎక్కడ అవసరం ఉంటే.. అక్కడ వేగంగా పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి, లోతట్టు ప్రాంతాల వారిని అక్కడికి తరలించాలి. ఇప్పటికే 5 ఎన్డీఆర్‌ఎఫ్, మరో 5 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నారు’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ఒక్కో కుటుంబానికి రూ.2500

‘సహాయ శిబిరాలలో వైద్య సదుపాయాలు, భోజనం, వసతి ఉండాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ‘బాధితుల పట్ల మానవతాధృక్ఫధంతో మెలగాలి. బాధితులు క్యాంపు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. ప్రతి ఒక్కరికీ రూ.1000 ఇవ్వాలి. కుటుంబానికి అయితే గతంలో మాదిరిగా కాకుండా మరో రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి. క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వెళ్లాలి. క్యాంపులకు రాకుండా ఇళ్లల్లోకి నీళ్లు వచ్చిన వారికి, క్యాంపు నుంచి మరలా వాళ్ల ఇళ్లకు వెనక్కి వెళ్లేవారికైనా వారికి అందాల్సిన 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలో చొప్పున అందించాలి. ఈ రేషన్‌ వారికి సకాలంలో సక్రమంగా అందించాలి’ అని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపైనా దృష్టి పెట్టాలి. తాగునీటి సౌకర్యాలు, జనరేటర్‌ ఏర్పాటు, బాలింతలు, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడం వంటి కీలక అంశాలను కూడా త్వరితగతిన చేపట్టాలి. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి. విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులునూ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి’ అని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 

Tags:    

Similar News