నేడు పల్నాడు జిల్లాలో త్రికోటేశ్వరుడిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పల్నాడు జిల్లాకు వస్తున్నారు.
దిశ, ప్రతినిధి నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పల్నాడు జిల్లాకు వస్తున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, అధికారులు శ్రమిస్తున్నారు. సీఎం తొలుత యల్లమంద గ్రామంలో సామాజిక పింఛన్లను అందజేస్తారు. ఆ తర్వాత కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వీటిపై బాబు ఎలా స్పందిస్తారో?
పల్నాడుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు తమ సమస్యలు చెప్పుకొని సాధించుకునేందుకు నాయకులు, రైతులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కోటప్పకొండలో టెంపుల్ టూరిజం, రోప్ వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని ఎమ్మెల్యే అరవింద బాబు కోరుతున్నారు. నరసరావుపేట జిల్లా కేంద్రమైన తర్వాత ట్రాఫిక్ సమస్య ఎక్కువవడంతో మహాత్మా గాంధీ హాస్పిటల్ ప్రాంతం నుంచి రోడ్డు వరకు విస్తరించాలన్న డిమాండ్ ఉంది. వీటికి తోడు లింగంగుంట్ల, ఆరేపల్లి రైతులు తమ భూముల గోడు చెప్పుకొనున్నారు. జిల్లాలోని ఉన్న స్పిన్నింగ్ మిల్లులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే వరికపూడిసెల ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని పల్నాటి వాసులు కోరనున్నారు. ఆయా సమస్యలపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారోనని అందరూ వేచి చూస్తున్నారు.