Home Minister: విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై అనిత సంచలన వ్యాఖ్యలు
విశాఖ సెంట్రల్ జైలు వివాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సెంట్రల్ జైలు(Visakha Central Jail) వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. జైలులో ఖైదీల వద్ద సెల్ ఫోన్లు, గంజాయిని అధికారులు గుర్తించారు. దీంతో జైలు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ మేరకు జైలులో కఠిన నిబంధనలు అమలు చేశారు. జైలులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై కొందరు సిబ్బంది అవమానకరంగా ఫీలయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జైలు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) సీరియస్ అయ్యారు. కొందరు జైలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే ఈ ఘటనతో విశాఖ(Vishaka) జైలులో స్వయంగా తనిఖీలు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం జైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులో సెల్ ఫోన్లు బయటపడటంపై విచారణ సాగుతోందన్నారు. ఫోన్లు ఎవరు వినియోగిస్తున్నారో త్వరలో తేల్చుతున్నామన్నారు. జైలులో గంజాయి మొక్క కనిపించిందని చెప్పారు. ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. తనిఖీల్లో కొన్ని విషయాలు తెలిశాయని చెప్పారు. సిబ్బందిని తనిఖీలు చేసిన బారక్‌ను కూడా చూశానని చెప్పారు. పోలీసు సిబ్బంది ఎలాంటి వివక్ష ఉందన్నారు. తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టామన్నారు. సిబ్బందికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.